వియత్నాం రాజధాని హనోయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో జరిగిన భారీ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లు, అపార్ట్మెంట్ భవనాలు సైతం కంపించిపోయాయి. పలు భవనాల కిటికీ అద్దాలు పగిలి ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
హనోయిలోని ఓ హాట్పాట్ రెస్టారెంట్లో ఈ పేలుడు సంభవించింది. ప్రాథమిక విచారణలో గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పేలుడు ధాటికి రెస్టారెంట్లోని కొంత భాగం కూలిపోయింది. సమీపంలోని భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. లోహపు తలుపులు వాటి ఫ్రేముల నుంచి ఊడిపడగా, పైకప్పులు, రేకుల షెడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పేలుడు ప్రకంపనలతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ భవనాలు కూడా కదిలిపోయాయని స్థానికులు తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో రెస్టారెంట్లో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమైంది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉన్నారా అని తెలుసుకునేందుకు ఆధునిక సెర్చ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు.
భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు హైడ్రాలిక్ యంత్రాలను కూడా రంగంలోకి దించారు. భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని భావించడంతో సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు ఖాళీ చేయించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 14 మందికి పైగా బాధితులను ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి తన ఇంటి బాల్కనీ తలుపు ఎగిరి పడిందని 26 ఏళ్ల ఓ మహిళ తెలిపింది. అయితే, ఆ సమయంలో తాను, తన సోదరి దుప్పటిలో ఉండటంతో పెద్దగా గాయాలు కాకుండా బయటపడ్డామని ఆమె వెల్లడించింది.
ఈ ఘటనపై హనోయి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ భారీ పేలుడు సంభవించిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడు.. ఆరుగురి ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Leave a Reply