ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమతినగర్ ప్రాంతంలో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకి ఆయుధాలతో చొరబడిన 7 గురు సభ్యుల ముసుగు దొంగల ముఠా.. కుటుంబ సభ్యులను కట్టేసి లక్షల కొద్దీ నగదు, నగలు దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
లక్నోలో కుటుంబంతో నివసిస్తున్న చమన్ లాల్ దివాకర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి అకస్మాత్తుగా చొరబడిన ఏడుగురు ముసుగు దొంగలు, అక్కడున్న వారిని తుపాకీతో బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత, బెడ్షీట్లతో వారి చేతులు, కాళ్లు కట్టేసి నోటికి టేప్ వేశారు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులను బెదిరించి బీరువాలు తీయించి, అందులో ఉన్న సుమారు రూ. 20 లక్షల నగదు, బంగారం, వెండి నగలను దొంగలు దోచుకెళ్లారు. సుమారు గంటపాటు ఆ ఇంట్లో ఈ భయానక దోపిడీ కాండ కొనసాగింది.
ఈ క్రమంలో, దొంగలు ఇంట్లోని మహిళల గదిలోకి ప్రవేశించినప్పుడు వారు భయంతో వణికిపోయారు. కానీ ఆ సమయంలో దొంగల్లో ఒకరు, “భయపడకండి, మా ఇళ్లలోనూ సోదరీమణులు ఉన్నారు, ప్రశాంతంగా ఉండండి” అని చెప్పడం ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా మారింది.
దొంగలు అక్కడి నుంచి పరారైన తర్వాత, కుటుంబ సభ్యులు తమ కట్లు విప్పుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోష్ (ఖరీదైన) ప్రాంతంలో జరిగిన ఈ భారీ దోపిడీ ఘటనపై ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply