“భర్తకు బదులు క్రికెటర్.! అభిషేక్ శర్మపై అమితమైన ప్రేమ. దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండి సెల్‌ఫోన్‌లో ముఖాన్ని చూసిన యువతి.. వైరల్ వీడియో.!”

భారత క్రికెట్ జట్టు యువ, డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్వా చౌత్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న వేళ, అభిషేక్ శర్మకు చెందిన ఓ మహిళా అభిమాని చేసిన వింత పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటూ వివాహిత మహిళలు తెల్లవారుజాము నుంచి చంద్రోదయం వరకు కనీసం చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండటం కర్వా చౌత్ పండుగ సంప్రదాయం. సాధారణంగా మహిళలు జల్లెడలోంచి చంద్రుడిని, ఆ తర్వాత తమ భర్త ముఖాన్ని చూసి, చంద్రుడికి పవిత్ర జలాన్ని (అర్ఘ్యం) సమర్పించి తమ ఉపవాసాన్ని విరమిస్తారు.

అయితే, అభిషేక్ శర్మకు వీరాభిమాని అయిన ఓ యువతి, ఈ సంప్రదాయ ఆచారానికి వింతైన క్రికెట్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమె మొబైల్ స్క్రీన్‌పై ఉన్న అభిషేక్ శర్మ ఫోటోను ఉంచి, జల్లెడ ద్వారా అతని ముఖాన్ని చూసింది. అంతేకాకుండా, మొబైల్ ఫోన్‌లోని ఫోటోకు.. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించినట్లుగానే పవిత్ర జలాన్ని సమర్పించి పూజలు చేసింది.

ఈ వింతైన వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు ఫన్నీగా తమ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ల పట్ల అభిమానులకు ఉండే పిచ్చి ప్రేమకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Posted

in

by

Tags: