ఉత్తరప్రదేశ్లో వరకట్న వేధింపుల ఆరోపణలు.. భర్త, మామ సహా ఏడుగురిపై కేసు నమోదు!
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో వరకట్న వేధింపులు, కుటుంబ హింసకు సంబంధించిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త, మామతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నాగినా ప్రాంతానికి చెందిన యువతికి, బిజ్నోర్ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం యువతి కుటుంబం సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు ఆరోపించింది.
అదనంగా రూ.5 లక్షలు నగదు, ఒక కారు తీసుకురావాలని భర్త, అతడి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్త ఉద్యోగం చేయకపోవడంతో కుటుంబ ఖర్చుల కోసం ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మామపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇదే సమయంలో తన భర్త శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా ఆమె ఆరోపించినట్లు కథనం పేర్కొంది.
అయితే, తన పరిస్థితిని ఆసరాగా చేసుకుని మామ తనతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని, తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా, తనకు అండగా నిలవాల్సిన భర్తే తనపై దాడి చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది.
వరుస వేధింపులతో తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమెను అత్తింటి నుంచి బయటకు పంపించినట్లు సమాచారం. అయినప్పటికీ, తన వైవాహిక జీవితాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్టోబర్ 5న తిరిగి భర్త ఇంటికి వెళ్లగా, అక్కడ మరోసారి దాడికి గురైనట్లు ఆరోపించింది.
ఇక అక్టోబర్ 15న గదిలో బట్టలు మార్చుకుంటున్న సమయంలో తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోను రహస్యంగా చిత్రీకరించి, దాని ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేసినట్లు కథనం పేర్కొంది.
ఈ వేధింపులను భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా భర్త, మామ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై హింపూర్ దీపా పోలీస్ స్టేషన్ అధికారి రవికరణ్ సింగ్ స్పందిస్తూ, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పరారీలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడైన మామను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply