మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో, ఆరు నెలల పసికందు కిడ్నాప్‌కు గురైందన్న వార్త తీవ్ర కలకలం రేపింది.
తన బిడ్డ కనిపించకుండా పోయాడంటూ ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించింది. బిడ్డ భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
కల్యాణ్ రైల్వే స్టేషన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో సదరు మహిళ ప్రవర్తన, ఆమె కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చింది.
తదుపరి సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించినప్పుడు, ఆ చిన్నారి అసలు కిడ్నాప్ కాలేదని, ఆ మహిళ పోలీసులకు పూర్తిగా అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలడంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ మహిళ అసలు నిజాన్ని ఒప్పుకుంది. ఆమె తన భర్తను వదిలి, తన మేల్ ఫ్రెండ్ (ప్రియుడిని) కలవడానికి కల్యాణ్ ప్రాంతానికి వచ్చినట్లు తేలింది.
ఈ నిజం తన కుటుంబ సభ్యులకు ఎక్కడ తెలిసిపోతుందోననే భయంతో, వారి నుండి తప్పించుకోవడానికి.. తన ఆరు నెలల బాబు దొంగతనానికి గురయ్యాడంటూ నాటకమాడి పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. ఈ కుట్రను మహాత్మా ఫులే చౌక్ పోలీసులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించి, ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీని విప్పారు.
