భర్తను వెతుక్కుంటూ వెళ్లిన భార్యకు ఇంతటి దారుణమా? స్పా ముందుకు అకస్మాత్తుగా వచ్చిన నల్ల కారు.. 3 నెలల గర్భిణికి ఎదురైన ఘోరం!

ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో భర్తను వెతుక్కుంటూ వెళ్లిన 3 నెలల గర్భిణికి ఎదురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఖుర్బురా ప్రాంతానికి చెందిన సాయిమా, తన భర్త గురించి ఆరా తీయడానికి నిరంజన్‌పూర్ మండి సమీపంలోని ‘అమేజ్ స్పా సెంటర్’కు వెళ్లారు. అక్కడున్న సిబ్బంది భర్త గురించి ఎలాంటి సమాచారం చెప్పడానికి నిరాకరించడంతో, ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ సమయంలో స్పా సెంటర్ పార్కింగ్ గేటు వద్ద ఒక నల్లటి కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన ఓ వ్యక్తి, మహిళ సాయిమాతో వాగ్వాదానికి దిగి ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తన కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా కొట్టారని, బలవంతంగా స్పా సెంటర్ లోపలికి లాక్కెళ్లి చంపేస్తామని బెదిరించారని సాయిమా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ దాడి వెనుక స్పా సెంటర్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ ఉన్నారని సాయిమా ఆరోపించారు. దాడి తర్వాత తీవ్ర భయాందోళనకు గురికావడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేకపోయానని, జరిగిన విషయాన్ని తన భర్తకు తెలియజేశానని ఆమె చెప్పారు. అనంతరం ఆమె భర్త సాయిమాను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత సాయిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేహా అనే మహిళతో పాటు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులపై డెహ్రాడూన్ పటేల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *