మహారాష్ట్రలోని ఏడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ తరుణంలో ఉద్ధవ్ థాకరే వర్గం నాయకురాలు ప్రియాంకా చతుర్వేది రాజ్యసభ పదవీకాలం కూడా ముగుస్తోంది.
ఏళ్ల క్రితం భర్త ఇష్టానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకకు మళ్ళీ అవకాశం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మహా వికాస్ ఆఘాడీ (MVA) కూటమిలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం, ఎంవీఏ కూటమి కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకోగలదు. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ ఎంపీగా పేరు తెచ్చుకున్న ప్రియాంకకు రెండోసారి అవకాశం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపీ పదవిపై ప్రియాంక స్పందన: తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై ప్రియాంక స్పందిస్తూ.. “ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి, వారు అందించిన మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. గత ఆరేళ్లుగా నేను కష్టపడి ప్రజల సమస్యలపై పోరాడాను. రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య మహిళకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించినందుకు నా పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం పనిచేస్తానని, అయితే మళ్ళీ అవకాశం వస్తుందా లేదా అనే దానిపై ఊహాగానాలు చేయనని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ సమీకరణాలు: ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ (16), శరద్ పవార్ ఎన్సీపీ (10), ఉద్ధవ్ శివసేన (20) మరియు ఇతర చిన్న పార్టీలు కలిసి మొత్తం 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ ఎంపీ గెలవడానికి 37 ఓట్లు అవసరం. కూటమిలో ఉన్న ఏకైక స్థానం కోసం కాంగ్రెస్ మరియు ఎన్సీపీ కూడా పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే మళ్ళీ ప్రియాంకకే అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.
భర్తను ఎదిరించి రాజకీయాల్లోకి: రాజకీయాల్లోకి రాకముందు ప్రియాంక ఒక పిఆర్ (PR) కంపెనీలో డైరెక్టర్గా పనిచేసేవారు. ఆమె భర్త విక్రమ్ చతుర్వేదికి ఆమె రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. “రాజకీయం చాలా మురికి కూపం, అక్కడ నిన్ను ఎదగనివ్వరు” అని ఆయన హెచ్చరించారు. కానీ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రతినిధిగా పనిచేశారు. 2019లో శివసేనలో చేరి ఎంపీగా విజయవంతమయ్యారు.
