క్రైమ్ న్యూస్: అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలకు అంతం లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలో ఒక యువకుడు తన సొంత వదిననే అతి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సదరు మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
అసలేం జరిగింది? ఈ ఘటన నెబువా నౌరంగియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే సునైనా అనే మహిళ భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే, ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్న మరిది వసంత్, ఆమెతో చనువు పెంచుకున్నాడు. కాలక్రమేణా వదినామరదుల మధ్య ప్రేమాయణం మొదలై అక్రమ సంబంధానికి దారితీసింది.
చెరకు తోటలోకి పిలిచి హత్య: నిందితుడైన వసంత్ తన వదినను భార్యలాగే చూసుకునేవాడు. అయితే, ఇటీవల సునైనా మరొక వ్యక్తితో మాట్లాడుతోందని వసంత్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఆ కోపంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని వసంత్ పథకం రచించాడు. నవంబర్ 26న సునైనాను మాట్లాడాలని నమ్మించి చెరకు తోటలోకి పిలిచాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం శవాన్ని అక్కడే పడేసి పరారయ్యాడు.
అస్థిపంజరం లభించడంతో బయటపడ్డ నిజం: తల్లి కనిపించకపోవడంతో ఆమె కుమారుడు అంగద్ చుట్టుపక్కల వెతికాడు. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 26 రోజుల తర్వాత, చెరకు తోటలో ఒక మానవ అస్థిపంజరం లభించడంతో ఈ కేసు మలుపు తిరిగింది. పోలీసులు సునైనా మొబైల్ కాల్ డేటాను విశ్లేషించగా, నిందితుడు వసంత్ పనేనని తేలింది. సాక్ష్యాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేయగా, పోలీసుల విచారణలో తన వదినను తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
