గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మాండ్వి ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో ఆర్తీబెన్ సోని (50), ఆమె కుమారుడు నీలకంఠ్ సోని, కుమార్తె ఝలక్ ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. ఇంట్లో పనిచేసే మహిళ రోజూలాగే పనికి వచ్చి తలుపు తట్టగా ఎవరూ తీయలేదు. దీంతో ఆమె ఆసుపత్రి వ్యాపార భాగస్వామి కేతన్ షాకు సమాచారం అందించింది. అతను తాళంతో వచ్చి తలుపు తెరిచి చూడగా, ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ కుటుంబంలో ఇప్పటికే ఒక విషాదం జరిగింది. ఆర్తీబెన్ భర్త చేతన్భాయ్ సోని గత ఏడాది గుండెపోటుతో మరణించాడు. అతని మరణం తర్వాత ఆర్తీబెన్ తన కొడుకు, కూతురితో కలిసి కుటుంబానికి చెందిన వైద్య వ్యాపారాన్ని చూసుకుంటోంది. ఓల్డ్ పాద్రా రోడ్డులో నడుస్తున్న ‘జెఫ్స్ హెల్త్ కేర్’ అనే ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను కూడా ఈ ముగ్గురే చూసుకుంటున్నట్లు సమాచారం. భర్త మరణానంతరం కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న క్రమంలో, ఇప్పుడు తల్లి, కొడుకు, కూతురు ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం బంధువులను, ఆ ప్రాంత ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఈ ఘటనకు సంబంధించి వెలువడిన సమాచారం ప్రకారం, కుటుంబానికి సుమారు రూ. 35 లక్షల అప్పు ఉందని, ఆసుపత్రి వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని తెలుస్తోంది. అలాగే, ఇంట్లో మూడు పేజీల లేఖ లభ్యమైందని, కుమార్తె ఝలక్ లక్ష సార్లు ‘రామ’ నామం రాసిందని సమాచారం వెలువడింది. అయితే, ఈ అప్పు లేదా వ్యాపార నష్టమే ముగ్గురి మృతికి కారణమని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించబడలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడోదర సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆండ్రూ మెక్వాన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, లేఖలోని అంశాలు, కుటుంబ నేపథ్యం, బంధువులు, సన్నిహితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియనున్నాయి.
