ఒక్కోసారి ఎదుటివారికి సహాయం చేయాలనే నిర్ణయం మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివసించే ఝావో జిన్కియాన్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. అతను వాటర్ప్రూఫింగ్ పనులు చేస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతుండేవాడు.
కానీ 2019లో అతను తీసుకున్న ఒక నిర్ణయం, అతన్ని అందరి దృష్టిలో హీరోని చేసింది, కానీ అదే సమయంలో అతని సొంత జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక మూడేళ్ల చిన్నారి గోదాము పైకప్పుపై చిక్కుకుపోయాడు. ఆ పిల్లాడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన ఝావో, ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి పైకి ఎక్కాడు. పిల్లాడిని సురక్షితంగా తన చేతుల్లోకి తీసుకుని కిందకు దిగుతుండగా ప్రమాదం జరిగింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, పిల్లాడిని కిందకు దించుతున్నప్పుడు ఝావో అదుపు తప్పి సుమారు ఆరు మీటర్ల ఎత్తు నుండి కింద పడిపోయాడు. పడేటప్పుడు పిల్లాడికి ఏమీ కాకూడదని తన శరీరాన్నే డాలులా అడ్డుపెట్టుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా బయటపడ్డాడు కానీ, ఝావో తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలోని చాలా ఎముకలు విరిగాయి. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు ఎంత ప్రయత్నించినా అతను తీవ్ర కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక అతను తిరిగి స్పృహలోకి రావడం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పారు.
చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఆశ వదులుకుంటారు, కానీ ఝావో భార్య సాంగ్ మెయ్ మాత్రం అలా చేయలేదు. ఊపిరి ఉన్నంత వరకు తన భర్తను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని ఆమె దృఢ నిశ్చయంతో ఉంది. దాదాపు ఏడు ఏళ్ల పాటు ఆమె జీవితం మొత్తం భర్త సేవకే అంకితమైపోయింది. అతనికి సమయానికి ఆహారం తినిపించడం, శరీరానికి వ్యాయామం చేయించడం, కదలని చేతులు-కాళ్లను మసాజ్ చేయడం, ప్రతిరోజూ అతనితో మాట్లాడుతూ అతని మెదడును క్రియాశీలకంగా ఉంచేలా ప్రయత్నించింది. తన భర్త ఒకరోజు కచ్చితంగా లేస్తాడని ఆమె నమ్మింది.
ఝావో కోలుకోవడం కోసం సాంగ్ వినూత్న మార్గాలను అనుసరించింది. ఆ నివేదిక ప్రకారం, ఆమె తరచుగా తన భర్త కాలి వేళ్లను మెల్లగా దంతాలతో కొరుకుతూ ఉండేది. దీనివల్ల నరాలు ప్రేరేపితమై, శరీరం స్పందించడం మొదలవుతుందని ఆమె బలంగా నమ్మింది. దాంతో పాటు పాత రోజులను గుర్తు చేస్తూ, కుటుంబ విషయాలను చెబుతూ నిరంతరం మాట్లాడుతుండేది. ఈ ప్రయత్నం కొన్ని రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏడు ఏళ్ల పాటు సాగింది.
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఝావో శరీరంలో కదలికలు మొదలయ్యాయి. మొదట చిన్న చిన్న ప్రతిస్పందనలు, చివరకు ఒకరోజు కళ్లు తెరిచాడు. ఈ కథలో అత్యంత భావోద్వేగపూరితమైన క్షణం ఏమిటంటే, అతను తన భార్య వైపు చూసి మెల్లగా ‘ఐ లవ్ యు’ (నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అని పలికాడు. ఆ మూడు మాటలు ఏడు ఏళ్ల ఆమె తపస్సుకు ఫలితాన్ని ఇచ్చాయి. అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి.
ఈ కథ ప్రజలను ఎందుకు అంతగా ప్రభావితం చేసింది అంటే, ఈ కుటుంబం మొదట్నుంచీ పరోపకారానికి మారుపేరు. సాంగ్ ఒకప్పుడు కిండర్ గార్టెన్ లో ఆర్ట్ టీచర్. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగా పెయింటింగ్ నేర్పించేది. ఝావో తన పరిమిత ఆదాయంతో ఒక మారుమూల గ్రామంలోని విద్యార్థి చదువుకు ఖర్చు పెట్టేవాడు. ఇతరులకు సహాయం చేయడం వీరి అలవాటు. అందుకే తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లాడిని కాపాడాడు.
ఈ కథ చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాంగ్ ధైర్యాన్ని, అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘నిజమైన ప్రేమకు నిర్వచనం ఈమే’ అని ఒకరు, ‘భర్త పిల్లాడిని కాపాడితే, భార్య ఏడు ఏళ్లుగా అతన్ని కాపాడింది’ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే బంధాలు తెగిపోతున్న వేళ, ఈ కథ నిజమైన బంధాల శక్తిని చాటి చెబుతోంది.
