బిర్యానీ అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, చాలా మందికి అది ఒక ఎమోషన్. అంతగా ఇష్టపడే ఈ బిర్యానీని ఇంట్లో చేసినప్పుడు అందరూ ఆశించేది ఏమిటంటే.. అది హోటల్ రుచితో లేదా ముస్లిం వివాహ వేడుకల్లో దొరికే బిర్యానీ రుచితో ఉండాలని. మనం ఇంట్లో ఎంత బాగా చేసినా, ఆ ప్రత్యేకమైన రుచి రాకపోవడానికి కారణం మనం వాడే ప్యాకెట్ మసాలాలు. ఇకపై అలా కాకుండా, ఈ పద్ధతిలో ఇంట్లోనే మసాలా పొడిని తయారు చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
- ధనియాలు – 100 గ్రాములు
- మిరియాలు – 25 గ్రాములు
- సోంపు – 25 గ్రాములు
- షాజీరా – 25 గ్రాములు
- లవంగాలు – 15 గ్రాములు
- సురుల్ దాల్చిన చెక్క (చుట్ట దాల్చిన చెక్క) – 25 గ్రాములు
- అనాస పువ్వు (Star Anise) – 25 గ్రాములు
- యాలకులు – 15 గ్రాములు
- మరాఠీ మొగ్గ – 25 గ్రాములు
- జాజిత్రి – 5 గ్రాములు
- బిర్యానీ ఆకు – 15 గ్రాములు
- నల్ల యాలకులు (పెద్ద యాలకులు) – 10 గ్రాములు
- కల్పాసి (Stone Flower) – 10 గ్రాములు
- ఎండిన రోజా రేకులు – 25 గ్రాములు
- జాజికాయ – 3 (దంచినవి)
తయారీ విధానం:
- స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేయకుండా ఒక్కో మసాలా దినుసును విడివిడిగా 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద దోరగా వేయించాలి.
- ముందుగా ధనియాలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిరియాలు, సోంపు, షాజీరా వేయించాలి.
- లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు కూడా విడివిడిగా వేయించాలి. సురుల్ దాల్చిన చెక్క వాడితే మంచి సువాసన వస్తుంది.
- మరాఠీ మొగ్గ, జాజిత్రి (తక్కువగా వేయాలి), బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, కల్పాసి, రోజా రేకులను కూడా వేయించాలి.
- చివరగా దంచిన జాజికాయ ముక్కలను వేయించి, అన్నింటినీ చల్లారనివ్వాలి.
- గట్టిగా ఉండే మరాఠీ మొగ్గ, నల్ల యాలకులు వంటి వాటిని ముందుగా ఒకసారి రోట్లో దంచి, ఆపై అన్నింటినీ కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఏడాది వరకు పాడవకుండా ఉంటుంది.
