అమెరికా భారతదేశంపై అదనపు సుంకాలు (టారిఫ్స్) విధించిన తర్వాత, చైనా మరియు రష్యాలతో భారతదేశానికి సాన్నిహిత్యం గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా యొక్క ఈ టారిఫ్ విధానాన్ని చైనా కూడా తీవ్రంగా ఖండించింది.
ఒకవేళ అమెరికా గనుక భారతదేశంపై సుంకాలు విధిస్తే.. భారతీయ వస్తువుల వ్యాపారానికి తమ దేశ మార్కెట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చైనా గతంలోనే ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య, ఇప్పుడు చైనా మరోసారి భారతదేశంపై ప్రశంసల జల్లు కురిపించింది. చైనా-భారత్-రష్యా త్రైపాక్షిక సంబంధాల (ట్రైలేటరల్ రిలేషన్స్) పై మాట్లాడుతుండగా చైనా భారత్‌ను కొనియాడింది. భారతదేశం తమకు అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య దేశమని చైనా పేర్కొంది. తాము ఒకరికొకరు ప్రత్యర్థులం కాదని, సహజసిద్ధమైన వాణిజ్య భాగస్వామ్య దేశాలమని స్పష్టం చేసింది.
అందువల్ల, ఒకరితో ఒకరు మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం, వాటిని కాపాడుకోవడం అనేది తమ మూడు దేశాల ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుందని చైనా అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రపంచంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి కూడా ఇది ఎంతో అవసరమని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూపై స్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ‘లిన్ జియాన్’ (Lin Jian) ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ లిన్ జియాన్ ఏం చెప్పారు?
చైనా, రష్యా మరియు భారతదేశం.. ఈ మూడు దేశాలు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు (ఎకానమీలు). కాబట్టి ఈ దేశాలు పరస్పరం మంచి సంబంధాలను కలిగి ఉండటం ప్రపంచానికి ఎంతో ప్రయోజనకరం. భవిష్యత్తులో వాణిజ్య మరియు రక్షణ రంగ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి చర్చలు నిరంతరం కొనసాగుతాయని చైనా తెలిపింది.
ఇదే సమయంలో, ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని, వాతావరణం స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో ఇటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనా మరియు భారతదేశం ఒకరికొకరు శత్రువులుగా కాకుండా స్నేహితులుగా మారాలి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా లిన్ జియాన్ ఆకాంక్షించారు. చైనా భారతదేశంతో పాటు రష్యాను కూడా ప్రశంసించింది. మూడు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాలనే అంశంపై చైనా గట్టిగా నొక్కి చెప్పింది.

Leave a Reply