భారతదేశంలోని విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా (అదనపు సీటు ఎంపిక ఛార్జీలు లేకుండా) కేటాయించాలని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణికుల సౌకర్యం, పారదర్శకత కోసం మరికొన్ని కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
కీలక మార్పులు ఇవే:
- 60% సీట్లు ఉచితం: ఇప్పటివరకు వెబ్ చెక్-ఇన్ సమయంలో దాదాపు అన్ని సీట్లకు ఎయిర్‌లైన్స్ అదనపు రుసుము వసూలు చేసేవి. ఇకపై ప్రతి విమానంలో 60% సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి.
- ఒకే PNR ఉంటే కలిసి కూర్చోవచ్చు: ఒకే PNR (Passenger Name Record) పై టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానంలో పక్కపక్కనే సీట్లు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు విడివిడిగా కూర్చోవాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
- క్రీడా సామాగ్రి మరియు సంగీత వాయిద్యాలు: వీటి రవాణాకు సంబంధించి స్పష్టమైన, ప్రయాణీకుల-హిత విధానాలను ఎయిర్‌లైన్స్ అనుసరించాలి. అలాగే పెంపుడు జంతువులను (Pets) తీసుకెళ్లడంపై కూడా స్పష్టమైన పాలసీలను వెల్లడించాల్సి ఉంటుంది.
- ప్రయాణికుల హక్కులు: విమానాలు ఆలస్యమైనా, రద్దీ అయినా లేదా బోర్డింగ్ నిరాకరించబడినా ప్రయాణికులకు ఉండే హక్కులను విమానశ్రయ కౌంటర్లు, మొబైల్ యాప్‌లు మరియు వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలి. ఈ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంచాలి.
