బంధాలు, విలువలు మరియు నమ్మకాలపై నిలబడాల్సిన వైవాహిక జీవితం, 2026 నాటి ఆధునిక కాలంలో కూడా కేవలం ఒక ‘వ్యాపారం’ లేదా ‘లావాదేవీ’గా మారిపోతోందా? ఇటీవలే వైరల్ అయిన ఒక పోస్ట్ ఇప్పుడు ఈ దిశగా తీవ్ర చర్చకు దారి తీసింది.
నగరాల్లోని విద్యావంతులైన కుటుంబాలు తమను తాము ఎంత ప్రగతిశీలమని (Progressive) చెప్పుకున్నప్పటికీ, పెళ్లి విషయం వచ్చేసరికి ‘కులం’ లేదా ‘డబ్బు’ అనే కొలమానాలను దాటలేకపోతున్నారనే చేదు నిజం ఇప్పుడు బయటపడింది.
ఘటన నేపథ్యం
‘ది డేట్ క్రూ’ (The Date Crew) అనే మ్యాచ్ మేకింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు ఓంద్రిలా కపూర్ తన లింక్డ్ఇన్ (LinkedIn) ప్రొఫైల్లో పంచుకున్న ఒక వాస్తవ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె వద్దకు వచ్చిన ఒక 32 ఏళ్ల పారిశ్రామికవేత్త (Entrepreneur) పెట్టిన వింత డిమాండ్, పెళ్లిళ్ల మార్కెట్లో ఉన్న కుల పిచ్చిని మరియు డబ్బుపై ఉన్న వ్యామోహాన్ని బట్టబయలు చేసింది.
కులం కావాలి లేదా ₹80 లక్షల జీతం కావాలి!
ఓంద్రిలా వద్దకు వచ్చిన ఆ 32 ఏళ్ల మహిళకు సొంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ ఉంది. ఆమె తండ్రి ఐపిఎస్ (IPS) అధికారి, తల్లి ఉపాధ్యాయురాలు. పైకి ఎంతో విద్యావంతులుగా, ఆధునిక భావాలు గలవారిగా కనిపించే ఈ కుటుంబానికి చెందిన అమ్మాయి, పెళ్లి కోసం పెట్టిన కండిషన్ చూసి మ్యాచ్ మేకర్ షాక్ అయ్యారు. ఆ యువతి డిమాండ్ ఏంటంటే: “నాకు కేవలం అగ్రవర్ణాలకు (బ్రాహ్మణ, రాజపుత్ర) చెందిన సంబంధాలనే వెతకండి”.
వెంటనే ఓంద్రిలా, “ఒకవేళ అబ్బాయి ఆదాయం, జీవనశైలి మరియు గుణాలు మీకు సరిపోయి, అతను వేరే కులం వాడైతే తిరస్కరిస్తారా?” అని అడిగారు. దానికి ఆ యువతి ఇచ్చిన సమాధానం విస్తుపోయేలా ఉంది. “ఒకవేళ అతను ఏడాదికి ₹80 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే, అప్పుడు నాకు కులంతో సంబంధం లేదు!” అని ఆమె బదులిచ్చింది.
డబ్బు ముందు కులం తక్కువేనా?
ఈ విషయంపై ఓంద్రిలా కపూర్ స్పందిస్తూ.. “నగరవాసులలో కులం అనేది ఎలా పని చేస్తుందో చూడండి. ఇక్కడ కులం కంటే ‘సామాజిక హోదా’ (Social Rank) ముఖ్యం. ఒకవేళ కులం కుదరకపోతే, ఆ లోటును డబ్బుతో పూడ్చాలనేది వీరి లెక్క. అంటే, డబ్బు ఉంటే కులపు గోడలను బద్దలు కొట్టడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రేమ, అవగాహన కంటే ‘వ్యాపారమే’ స్పష్టంగా కనిపిస్తోంది” అని అసహనం వ్యక్తం చేశారు.
నెటిజన్ల ఆగ్రహం!
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “వెతకాల్సింది ప్రేమని, కానీ ఇప్పుడు వెతుకుతోంది సిటిసి (CTC) మరియు కులాన్ని” అని ఒకరు కామెంట్ చేయగా, “భారతీయ వివాహాలు ఇప్పుడు కేవలం ఆర్థిక లావాదేవీలుగా మారిపోయాయి” అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓంద్రిలా హితవు
“మనం పెద్ద నగరాల్లో కూర్చుని ప్రగతిశీల వ్యక్తులమని చెప్పుకుంటాం. కానీ మ్యాట్రిమోనియల్ యాప్ ఓపెన్ చేయగానే మొదట కులం ఫిల్టర్ వేస్తాం. ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయాలంటే మన తల్లిదండ్రులతో మనం ధైర్యంగా మాట్లాడాలి. కులం కంటే మనిషితనానికి విలువ ఇచ్చే సంస్కృతి మన నుండే మొదలవ్వాలి” అని ఓంద్రిలా పిలుపునిచ్చారు.
