ప్రపంచ దేశాలను వణికిస్తున్న తీవ్ర వాతావరణ మార్పుల ఫలితంగా, ‘సూపర్ ఎల్నినో’ (Super El Nino) తీవ్ర ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.73 లక్షల మరణాలు సంభవించవచ్చని ‘ఎల్నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ (El Nino Heat Mortality Tracker) ఓ సంచలన నివేదికను వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల రోజురోజుకూ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), మానవాళి మనుగడకు, ఆరోగ్యానికి అతిపెద్ద సవాలుగా పరిణమించింది.
ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో అత్యధిక ప్రాణనష్టం సంభవించే దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక్క భారతదేశంలోనే ఏకంగా 55,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికా దేశమైన నైజీరియా అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొంటుందని ఈ అంచనా పేర్కొంది. అంతేకాకుండా, ఎల్నినో ప్రతికూల ప్రభావాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 4.85 లక్షల మరణాలు నమోదయ్యాయన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మండిపోతున్న వడగాలులు (హీట్ వేవ్స్), అకస్మాత్తుగా జరుగుతున్న ఊహించని వాతావరణ మార్పుల వల్ల ప్రాణనష్టం నానాటికీ పెరుగుతుండటం.. ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు, పర్యావరణవేత్తలకు ఒక పెద్ద హెచ్చరికగా మారింది.
