ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన తాజా అధ్యయనం, 2050 నాటికి భారతదేశం వంటి జనసాంద్రత కలిగిన దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగబోతున్నాయని హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని, ఇది బిలియన్ల కొద్దీ ప్రజల జీవితాలను రిస్క్‌లో పడేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది దీని ప్రభావానికి గురవుతారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందే దీని ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయని హెచ్చరించారు.
పారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిమితికి భూమి చేరువవుతుండటంతో, తీవ్రమైన వేడిని తట్టుకోవాల్సిన ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుంది. ‘నేచర్ సస్టైనబిలిటీ’ (Nature Sustainability) పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. 2010లో ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం మంది తీవ్రమైన వేడిని అనుభవించగా, రాబోయే దశాబ్దాలలో ఈ శాతం 41కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, దక్షిణ సుడాన్, లావోస్ మరియు బ్రెజిల్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరుగుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో, అధిక జనాభా కలిగిన దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. వీటిలో ముఖ్యంగా భారతదేశం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నైజీరియా మరియు ఫిలిప్పీన్స్ ఉన్నాయి.
