వాషింగ్టన్: భారత్ మరియు అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం (Trade Deal)పై అమెరికా అధికార యంత్రాంగంలోనే విభేదాలు బయటపడ్డాయి. ఒక నివేదిక ప్రకారం, ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులే ఈ ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా మారారు.
రిపబ్లికన్ పార్టీ ఎంపీ టెడ్ క్రూజ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘యాక్సియోస్’ (Axios) అనే వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ మరియు వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారత్‌తో జరగాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్నారు. దీనికి సంబంధించి టెడ్ క్రూజ్ యొక్క ఒక ఆడియో రికార్డింగ్ బయటపడింది. అందులో ఆయన తన డోనర్లతో జరిగిన ప్రైవేట్ సమావేశంలో ఈ విషయంపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.
భారత్‌తో ఒప్పందం కోసం పోరాటం భారత్‌తో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను “వైట్ హౌస్‌తో పోరాడుతున్నాను” అని క్రూజ్ ఆ రికార్డింగ్‌లో పేర్కొన్నారు. దీనిని ఎవరు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన నవారో, వెన్స్ మరియు కొన్ని సందర్భాల్లో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లను కూడా ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బహిరంగంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాల గురించి చాలా సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. “మీ ప్రధాని అంటే నాకు చాలా గౌరవం. ఆయన అద్భుతమైన వ్యక్తి మరియు నా స్నేహితుడు. మా మధ్య మంచి ఒప్పందం జరుగుతుంది” అని అన్నారు. కానీ తెర వెనుక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టారిఫ్‌లపై ట్రంప్‌తో ఘర్షణ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ (సుంకాల) విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగిస్తుందని క్రూజ్ హెచ్చరించారు. 2026 ఎన్నికల కంటే ముందే ప్రజల పొదుపు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగితే రిపబ్లికన్ పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2025లో ట్రంప్ కొత్త టారిఫ్‌లను అమలు చేసినప్పుడు, చాలామంది సెనేటర్లు ఆయనను కలిసి నిర్ణయం మార్చుకోమని కోరారు. కానీ ఆ చర్చలు ఫలించలేదు సరికాదా, ట్రంప్ చాలా కోపంగా ప్రవర్తించారని క్రూజ్ పేర్కొన్నారు.
జేడీ వెన్స్పై విమర్శలు ఈ రికార్డింగ్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్పై కూడా క్రూజ్ విమర్శలు చేశారు. వెన్స్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్‌సన్‌కు “శిష్యుడు” అని ఎద్దేవా చేశారు. వీరిద్దరి ఆలోచనా ధోరణి అమెరికా విదేశాంగ విధానాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలను బట్టి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య సమస్యే కాకుండా, అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారిందని స్పష్టమవుతోంది.
