భారత్ – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ క్రమంలో, 2026వ సంవత్సరంలో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 4 మ్యాచ్‌లలో భారత జట్టే విజయం సాధించగా, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పాకిస్థాన్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో, ‘రైజింగ్ స్టార్స్ ఆసియా కప్’ టోర్నీలో ఇరు జట్లు నేడు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ – పాకిస్థాన్ జట్లు తొలిసారి తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 58 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఆ తర్వాత ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్లోనూ భారత జట్టు 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలిచి, ఈ ఏడాది భారత్‌పై తన తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే, అదే టోర్నీ ఫైనల్లో భారత జట్టు మళ్లీ సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ తుది పోరులో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ ట్రోఫీని ముద్దాడింది.
తాజాగా, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో నేడు మరోసారి భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్‌కు ఖతార్ రాజధాని దోహా ఆతిథ్యమిస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని, 3 గంటలకు టాస్ వేస్తారని నిర్వాహకులు ప్రకటించారు. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు, పాకిస్థాన్‌పై కూడా విజయం సాధించి సెమీఫైనల్ బెర్తుకు మరింత చేరువవ్వాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

Leave a Reply