న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి భారత్ ఒక పెద్ద అడుగు వేసింది. భారత నావికాదళ (Indian Navy) అమ్ములపొదిలో ఏప్రిల్ 03, 2026న మూడవ అణ్వాయుధ క్షిపణి సబ్మెరైన్ ‘INS అరిదమన్’ అధికారికంగా చేరింది. ఈ సబ్మెరైన్‌ను అత్యంత రహస్యంగా సముద్రంలోకి దించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ దీనిని “శబ్దం కాదు.. శక్తి” అని అభివర్ణిస్తూ ప్రశంసించారు. హిందూ మహాసముద్రంలో భారత్ వేసిన ఈ ఎత్తుగడతో చైనా, పాకిస్థాన్ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.
భారత అజేయ ‘త్రిశక్తి’ పూర్తి: INS అరిదమన్ రాకతో భారత ‘న్యూక్లియర్ ట్రయాడ్’ (Nuclear Triad) సంపూర్ణమైంది. అంటే ఇప్పుడు భారత్ భూమి, ఆకాశం మరియు సముద్రం.. ఈ మూడు మార్గాల నుండి అణ్వాయుధ దాడి చేయగల సామర్థ్యాన్ని పొందింది. అమెరికా, ఫ్రాన్స్, చైనా మరియు రష్యాల తర్వాత ఈ త్రిశక్తి సామర్థ్యం కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
ఈ సబ్మెరైన్ ప్రత్యేకతలు ఏమిటి?
- బరువు: INS అరిదమన్ 7,000 టన్నుల బరువు ఉంటుంది. ఇది శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలదు.
- పవర్: ఇది 80 మెగావాట్ల అణు రియాక్టర్‌తో నడుస్తుంది. దీనివల్ల నెలల తరబడి నీటి అడుగునే ఉండగలదు.
- సామర్థ్యం: INS అరిహంత్ మరియు INS అరిఘాట్ కంటే ఇది చాలా అధునాతనమైనది.
- ఆయుధాలు: ఇందులో ఎక్కువ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇది 3,500 కి.మీ రేంజ్ గల K-4 మరియు 750 కి.మీ రేంజ్ గల K-15 బాలిస్టిక్ క్షిపణులతో సిద్ధంగా ఉంది.
చైనా సబ్మెరైన్లకు గట్టి పోటీ: నిపుణుల అభిప్రాయం ప్రకారం, INS అరిదమన్ చేరికతో అణ్వాయుధ దాడిని తిప్పికొట్టే భారత సామర్థ్యం పెరిగింది. అయితే చైనా వద్ద 60కి పైగా సబ్మెరైన్లు ఉండటం వల్ల సాంకేతిక సవాళ్లు ఇంకా ఉన్నాయి. భారత్ వద్ద ప్రస్తుతం బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి. శత్రువుల సబ్మెరైన్లను వేటాడటానికి భారత్‌కు ‘హంటర్’ (SSN) సబ్మెరైన్లు కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
భారత్ ఎప్పుడూ శాంతిని కాంక్షిస్తూ ‘నో ఫస్ట్ యూజ్’ (ముందుగా దాడి చేయకపోవడం) విధానాన్ని అనుసరిస్తుంది. అయితే INS అరిదమన్ రాక శత్రువులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది: భారత్‌పై దాడి జరిగితే, ప్రతీకారం తప్పదు. ప్రస్తుతం భారత్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ల అభివృద్ధిపై దృష్టి సారించింది.
