భారత పరిశోధకులకు జాక్‌పాట్! 12 నెలల పాటు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ChatGPT Plus.. ముగ్గురికి ఉచిత యాక్సెస్ ఇస్తున్న ఓపెన్‌ఏఐ.. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

భారత్‌లోని అర్హులైన విద్యా పరిశోధకులకు 12 నెలల పాటు ఉచితంగా ChatGPT Plus సేవలను అందించే కార్యక్రమాన్ని ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ ప్రారంభించింది. ‘ChatGPT for Academic Researchers’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని సైన్స్, గణితం, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో పరిశోధనలు చేస్తున్న వారికి సహాయపడేలా విస్తరించారు.

ఈ పథకం కింద ఎంపికైన ప్రతి పరిశోధనా బృందానికి ముగ్గురికి యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్రధాన పరిశోధకుడితో పాటు ఆయనతో కలిసి పనిచేసే మరో ఇద్దరు పరిశోధకులు కూడా 12 నెలల పాటు ఈ సేవను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 వేల గ్రాంట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓపెన్‌ఏఐ, నవంబర్ 30 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో పనిచేస్తున్న రీసెర్చ్ ప్రొఫెసర్లు, పోస్ట్-డాక్టోరల్ పరిశోధకులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే, గత మూడేళ్లలో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, భూమి మరియు గ్రహ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితం లేదా భౌతిక శాస్త్ర విభాగాల్లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించి ఉండాలి. ఆ పరిశోధనా పత్రంలో సంబంధిత పరిశోధకుడి పేరు ఉండటంతో పాటు, విద్యా సంస్థతో ఉన్న అనుబంధాన్ని కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

పరిశోధనా పత్రాలను వెతకడం, పరిశోధనా ప్రతిపాదనలను రూపొందించి విశ్లేషించడం, డేటా విశ్లేషణ, పరిశోధనలకు అవసరమైన కోడ్ రాయడం, అందులోని లోపాలను సరిదిద్దడం వంటి పనులకు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. పరిశోధనా పత్రాలు, నిధుల మంజూరు (గ్రాంట్) దరఖాస్తులను సిద్ధం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఈ పథకం ద్వారా పంచుకునే సమాచారాన్ని ఓపెన్‌ఏఐ మోడళ్ల శిక్షణ కోసం డిఫాల్ట్‌గా ఉపయోగించబోమని సంస్థ స్పష్టం చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *