వాషింగ్టన్: మధ్యప్రాచ్యం (Midde East) లో పరిస్థితులు మళ్లీ చేజారిపోయే స్థితికి చేరుకున్నాయి. అక్కడ ఇరు దేశాలూ తిరిగి దాడులు ప్రారంభించడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది.
ఈ క్రమంలో, ఈరాన్‌పై అత్యంత ఘోరమైన దాడి చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. అమెరికా, ఈరాన్ దేశాల మధ్య ఘర్షణ మళ్లీ పీక్స్‌కు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ఈరాన్‌కు విసిరిన ఈ నేరుగా హెచ్చరిక ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టింది.
ట్రంప్ ఆగ్రహం: ఈరాన్ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయకుండా కాలయాపన చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీనిపై ఆయన తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. “ఈరాన్ కేవలం మాటలు మాత్రమే చెబుతోంది.. చేతల్లో ఏమీ చూపించడం లేదు. తమకు అనుకూలమైన ఒప్పందం కోసం వారు చాలా సమయం తీసుకుంటున్నారు. దీనికి వారు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు” అని రాసుకొచ్చారు.
అంతేకాకుండా విలేకరులతో మాట్లాడుతూ.. “మేము వారిపై అత్యంత కఠినమైన దాడులు చేయబోతున్నాము. నిన్న వారిపై దాడి చేశాము, ఈరోజు కూడా అంతకంటే శక్తివంతంగా దాడి చేస్తాము” అని దూకుడుగా ప్రకటించారు.
అసలు కారణం ఏమిటి?: ఈ హఠాత్తు ఘర్షణకు ముఖ్య కారణం ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ప్రాంతంలో జరిగిన ఒక ఘటన. అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ’ (Apache) రకం హెలికాప్టర్‌ను ఈరాన్ కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఆ హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సైనికులు అదృష్టవశాత్తూ ఒక డ్రోన్ బోటు సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి ప్రతీకారంగా, అమెరికా సైన్యం ఈరాన్‌కు చెందిన వైమానిక రక్షణ కేంద్రాలు (Air defense positions), రాడార్ కేంద్రాలు మరియు గ్రౌండ్ కంట్రోల్ బేస్‌లపై వైమానిక దాడులు జరిపింది.
అమెరికా చేసిన ఈ దాడులకు సమాధానంగా ఈరాన్ కూడా తన క్షిపణులు (Missiles), డ్రోన్లను ప్రయోగించింది. జోర్డాన్, కువైట్ మరియు బహ్రెయిన్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈరాన్ ఈ దాడులకు తెగబడింది.
నష్టం జరగలేదు: అయితే, ఈరాన్ చేసిన ఈ దాడుల వల్ల అమెరికాకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఈరాన్ ప్రయోగించిన అత్యధిక క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేశామని, అమెరికా సైనికులు ఎవరికీ గాయాలు కాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
గత ఏప్రిల్ నెలలో అమెరికా-ఈరాన్ మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత జరిగిన అత్యంత కీలకమైన ఘర్షణగా దీనిని భావిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో అమెరికాతో ఉన్న దౌత్య సంబంధాలు మరియు చర్చలను పునఃసమీక్షించనున్నట్లు ఈరాన్ ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఈరాన్ల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతుండగా.. ఇప్పుడు అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగడం మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతను పెంచింది.
యుద్ధ భయాలు: శాంతి ఒప్పందం కుదరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఈరాన్ను హెచ్చరించడం.. హెలికాప్టర్ కూల్చివేతకు బదులుగా అమెరికా దాడులు చేయడం.. దానికి పోటీగా ఈరాన్ కూడా అమెరికా స్థావరాలపై విరుచుకుపడటం వంటి వరుస పరిణామాలు మధ్యప్రాచ్య దేశాలలో మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా అనే భయాన్ని కలిగిస్తున్నాయి.

Leave a Reply