భార్యకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిపై భర్తకు హక్కు ఉంటుందా? హైకోర్టు కీలక తీర్పు – పూర్తి వివరాలు

హైదరాబాద్: ఒక మహిళ తన పుట్టింటి వైపు నుండి (తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల ద్వారా) పొందిన ఆస్తి విషయంలో ఆంధ్రా హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆ మహిళకు సంతానం లేకుండానే ఆమె మరణిస్తే, ఆ ఆస్తి ఆమె భర్తకు చెందదని.. తిరిగి ఆమె పుట్టింటి వారసులకే వెళ్తుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు ఏంటి? కోర్టు తీర్పులో ఏం చెప్పిందో వివరంగా చూద్దాం.

కేసు నేపథ్యం

హిందూ వివాహ చట్టం ప్రకారం ఆస్తి హక్కుల విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి ఒక క్లిష్టమైన ప్రశ్నకు ఆంధ్రా హైకోర్టు సమాధానం ఇచ్చింది. విషయానికొస్తే.. ఒక బామ్మకు ఇద్దరు మనవరాలు ఉన్నారు. బామ్మ తన వద్ద ఉన్న ఒక ఆస్తిని 2002లో తన మొదటి మనవరాలికి బహుమతిగా (Gift Deed) ఇచ్చింది. దీనివల్ల రెవెన్యూ రికార్డుల్లో ఆ ఆస్తి మొదటి మనవరాలి పేరు మీదకు మారింది. అయితే, ఆ ఆస్తిని పొందిన కొద్ది కాలానికే మొదటి మనవరాలు మరణించింది. ఆమెకు పిల్లలు లేరు.

దీంతో బామ్మ తాను ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, ఆ ఆస్తిని తన రెండవ మనవరాలికి (పిటిషనర్) విలునామా (Will) ద్వారా రాసిచ్చింది. 2012లో బామ్మ మరణించిన తర్వాత, రెండవ మనవరాలు ఆ ఆస్తిని తన పేరు మీదకు మార్చాలని దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారి అందుకు అంగీకరించారు. కానీ, మరణించిన మొదటి మనవరాలి భర్త దీనిని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేశారు.

భర్త వాదన

ఒక్కసారి దానంగా (Gift) ఇచ్చిన ఆస్తిని బామ్మ రద్దు చేయడం చెల్లదని, తన భార్యకు చెందిన ఆ ఆస్తి వారసత్వంగా తనకే దక్కాలని భర్త వాదించారు. జాయింట్ కలెక్టర్ భర్త వాదనతో ఏకీభవించి అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ రెండవ మనవరాలు ఆంధ్రా హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు తీర్పు మరియు చట్టం ఏం చెబుతోంది?

ఈ కేసును విచారించిన జస్టిస్ ధార్ల రాజశేఖర్ రావు, హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను స్పష్టంగా వివరించారు.

  • సెక్షన్ 15(2)(a) ప్రకారం: ఒక హిందూ మహిళ తన తండ్రి లేదా తల్లి ద్వారా వారసత్వంగా లేదా బహుమతిగా పొందిన ఆస్తి విషయంలో.. ఆమెకు సంతానం (వారసులు) లేకుండా మరణిస్తే, ఆ ఆస్తి ఆమె భర్తకు లేదా భర్త వారసులకు చెందదు. అది తిరిగి ఆమె తండ్రి యొక్క వారసులకే (అంటే ఆమె సోదర సోదరీమణులు లేదా పుట్టింటి వారు) చేరుతుంది.
  • ఆ ఆస్తిపై భర్తకు ఎలాంటి ప్రాథమిక హక్కు లేనప్పుడు, బామ్మ చేసిన గిఫ్ట్ డీడ్ రద్దును ప్రశ్నించే అధికారం అతనికి లేదని కోర్టు పేర్కొంది.
  • జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఆ ఆస్తిని రెండవ మనవరాలి పేరు మీదకు మార్చాలని తహసీల్దార్‌ను జస్టిస్ రాజశేఖర్ రావు ఆదేశించారు.

Posted

in

by

Tags: