సింగపూర్: విడాకుల తర్వాత భార్యకు నెలనెలా భరణం చెల్లించాల్సి వస్తుందనే భయంతో, ఒక వ్యక్తి తన భారీ జీతంతో కూడిన ఉద్యోగాన్నే వదిలేశాడు. కెనడాకు చెందిన ఈ వ్యక్తి సింగపూర్‌లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ అధికారిగా పనిచేస్తూ, ఏడాదికి సుమారు 6 కోట్ల రూపాయల (8,60,000 సింగపూర్ డాలర్లు) జీతం పొందేవాడు.
అసలు కథ ఇదే:
2023లో ఈ దంపతుల మధ్య విడాకుల ప్రక్రియ మొదలైంది. భార్య తనతో పాటు తన నలుగురు పిల్లల పోషణ కోసం నెలకు సుమారు 15 లక్షల రూపాయలు భరణంగా ఇవ్వాలని కోర్టులో దరఖాస్తు చేసుకుంది.
భార్య ఇంత పెద్ద మొత్తాన్ని అడిగేసరికి, ఆ డబ్బు ఇవ్వడం ఇష్టం లేని భర్త.. అక్టోబర్ 2023లో అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన వద్ద ఆదాయమే లేకపోతే భరణం ఇచ్చే అవసరం ఉండదని అతను భావించాడు. ఆ తర్వాత సింగపూర్ వదిలి కెనడాకు వెళ్లిపోయాడు.
కోర్టు ఆగ్రహం:
సింగపూర్ న్యాయస్థానం సదరు వ్యక్తి ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది. విచారణకు హాజరు కాకపోవడంతో 2024 ప్రారంభంలో అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. చివరికి డిసెంబర్ 2024లో అతను జూమ్ కాల్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు.
న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు:
- భార్య భరణం కోరిన వెంటనే ఉద్యోగాన్ని వదులుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యమని జిల్లా జడ్జి ఫాంగ్ హిసియావో చుంగ్ పేర్కొన్నారు.
- “ఒక బాధ్యతగల తండ్రి రాజీనామా చేసే ముందే తన కుటుంబ పోషణ కోసం మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలి కానీ, ఇలా బాధ్యతల నుండి తప్పించుకోవడం సరికాదు” అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
వాదనలు – తీర్పు:
భర్త తరపు న్యాయవాది వాదిస్తూ.. భార్య విలాసవంతమైన సెలవుల కోసం, కాస్మెటిక్ చికిత్సల కోసం భారీగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. వైద్యం, విద్య ఉచితంగా లభించే కెనడాకు కుటుంబం మొత్తం తిరిగి రావాలని కోరారు. అయితే, పిల్లలు సింగపూర్‌లోని ఉన్నత జీవన ప్రమాణాలకు అలవాటు పడ్డారని, దానిని కొనసాగించాలని భార్య వాదించింది.
చివరికి కోర్టు స్పందిస్తూ.. భార్య తన జీవనశైలి కోసం భవిష్యత్తులో ఉద్యోగం వెతుక్కున్నా, తండ్రి మాత్రం తన ఆర్థిక బాధ్యతల నుండి తప్పుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బకాయి ఉన్న భరణం కింద సుమారు 4 కోట్ల రూపాయలను (6,34,000 సింగపూర్ డాలర్లు) తక్షణమే భార్య, పిల్లలకు చెల్లించాలని కోర్టు అతడిని ఆదేశించింది.
