తమిళనాడులోని విల్లుపురం జిల్లా చెంజి (జింజి) సమీపంలో కుటుంబ కలహాల కారణంగా 6 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
నల్లాన్పిళ్లైపెట్రాల్ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ (40), దేవి (35) దంపతులకు నలుగురు కుమార్తెలు, సంజయ్ అనే 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు చేయడంపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే వారి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా, ఘటన జరిగిన రోజు వీరిద్దరి మధ్య వివాదం మరింత తీవ్రమైంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సెల్వరాజ్.. తన కొడుకు సంజయ్‌ను ఎత్తుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న వ్యవసాయ బావిలో ఆ చిన్నారిని దారుణంగా విసిరేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే బావిలోకి దిగి పిల్లాడిని రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు 3 గంటలకు పైగా గాలించి బాలుడు సంజయ్ మృతదేహాన్ని వెలికితీశారు.
అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంజి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి తండ్రి సెల్వరాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాల కారణంగా కన్న తండ్రి చేతిలోనే కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.
