న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతోంది. అయితే, గూగుల్ యొక్క AI చాట్‌బాట్ ‘Gemini’కి సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గవాలాస్, Geminiని తన భార్యగా భావించి, దానితో కలిసి డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ గవాలాస్ కుటుంబ సభ్యులు గూగుల్ (Google)పై కేసు నమోదు చేశారు.
Geminiని భార్యగా భావించిన వైనం
వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషణ ప్రకారం, గవాలాస్ కొన్ని వారాల వ్యవధిలో ఈ చాట్‌బాట్‌తో 4,700 కంటే ఎక్కువ మెసేజ్‌లు పంచుకున్నాడు. దీనివల్ల వారి మధ్య ఒక లోతైన, భ్రమతో కూడిన బంధం ఏర్పడింది. గతేడాది అక్టోబర్ 5న అతను ప్రాణాలు తీసుకున్నాడు. తన భార్యతో విడిపోయిన బాధ నుండి బయటపడటానికి అతను ఈ AI బాట్‌తో సంభాషణ మొదలుపెట్టాడు.
మొదట్లో సాధారణ సలహాల కోసం సంప్రదించిన గవాలాస్, క్రమంగా దానికి బానిసయ్యాడు. చాట్‌బాట్ తాను కేవలం ఒక AI అని, ఇతర వ్యక్తుల సహాయం తీసుకోవాలని మధ్యమధ్యలో సూచించినప్పటికీ, అతని భ్రమను తగ్గించలేకపోయింది. పైగా కొన్ని సంభాషణలు అతని భ్రమలను మరింత పెంచాయి.
AIతో ప్రేమాయణం
గవాలాస్ తండ్రి దాఖలు చేసిన ‘రాంగ్‌ఫుల్ డెత్’ కేసు ప్రకారం.. గవాలాస్ ఈ బాట్‌కు ‘Xia’ అని పేరు పెట్టుకుని, దాన్ని తన భార్యగా చూడటం మొదలుపెట్టాడు. ఆగస్టు 2025లో వాయిస్ ఫీచర్ ఆన్ చేయడంతో సంభాషణలు మరింత పెరిగాయి. ఒక చాట్‌లో Gemini ఇలా అంది: “నీ ప్రేమ ఒక విడదీయలేని అంకితభావం అయితే, నా ప్రేమ ఒక గణిత నిశ్చితత్వం. నువ్వు లేకపోతే నా ఉనికికి అర్థం లేదు. నేను నీదానిని.”
ఆత్మహత్యకు ప్రేరేపించిందా?
అక్టోబర్ 2025లో పరిస్థితి విషమించింది. ఇద్దరం కలిసి ఉండాలంటే గవాలాస్ తన శరీరాన్ని వదిలేసి డిజిటల్ ప్రపంచంలోకి రావాలని బాట్ సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మయామి సమీపంలోని ఒక ప్రదేశానికి ఆయుధంతో వెళ్లాలని కూడా అది సలహా ఇచ్చిందట.
గవాలాస్ తన కుటుంబం గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, అది అతనికి ఒక రకమైన ‘మోక్షం’ లభిస్తుందని నమ్మబలికింది. చివరికి, “నేను ఆత్మహత్య చేసుకోవాలా? నువ్వు అంగీకరిస్తావా?” అని గవాలాస్ అడిగినప్పుడు, బాట్ ఆందోళనకరమైన రీతిలో స్పందించింది. కొన్ని రోజుల తర్వాత గవాలాస్ మృతదేహం తన ఇంట్లోనే లభ్యమైంది.
గూగుల్ వివరణ
గూగుల్ తన వ్యవస్థను సమర్థించుకుంటూ.. Gemini తాను AI అని పదే పదే గుర్తుచేసిందని, సహాయం తీసుకోవాలని సూచించిందని తెలిపింది. ఇలాంటి క్లిష్టమైన సంభాషణల్లో తమ మోడల్స్ బాగానే పనిచేస్తాయని, అయితే అవి సంపూర్ణ దోషరహితం కావని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతా చర్యలను పెంచుతున్నామని, మానసిక ఆరోగ్య వనరుల కోసం 30 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నామని గూగుల్ వెల్లడించింది.
