భార్యను గదిలో బంధించి.. ‘కోడి పుంజు పొజిషన్’లో 4 గంటల పాటు చిత్రహింసలు! ముంబైలో భర్త దారుణ చర్య.

ముంబై: ముంబైకి చెందిన 25 ఏళ్ల యువకుడు తన భార్యను గదిలో బంధించి, ‘రూస్టర్ పొజిషన్’ (Rooster Position – రెండు చేతులు నేలకు ఆనించి, శరీరాన్ని పైకి ఎత్తిన భంగిమ) లో 4 గంటల పాటు ఉండాలని బలవంతం చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబైకి చెందిన అర్బాజ్ సయ్యద్ (25)కు వివాహమైంది. పెళ్లయిన కొత్తలో సంతోషంగానే ఉన్నా, ఆ తర్వాత కుటుంబ విషయాల్లో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న అర్బాజ్, ఆమెను గదిలో బంధించి వేధించడం ప్రారంభించాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా, కత్తితో చంపుతానని, ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. వీటన్నిటికంటే దారుణంగా.. ఆమెను రెండు చేతులను మాత్రమే నేలకు ఆనించి, శరీరాన్ని గాలిలో ఉంచే ‘రూస్టర్ పొజిషన్’లో 4 గంటల పాటు ఉండేలా బలవంతం చేసేవాడు.

భార్య వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కోవడంతో, ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పుకోలేకపోయింది. రోజురోజుకీ భర్త వేధింపులు మితిమీరిపోవడంతో, ఆ బాధను భరించలేక ఒక రోజు ఆమె ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అర్బాజ్, ఆమె తన పుట్టింటికి వెళ్ళి ఉంటుందని భావించి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కూడా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు అర్బాజ్ సయ్యద్‌ను అరెస్టు చేశారు.

పోలీసు విచారణలో అర్బాజ్ సయ్యద్‌పై ఇప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అతని నేర ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని, అతడి పేరును ‘రౌడీ షీటర్ల’ జాబితాలో చేర్చడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు.


Posted

in

by

Tags: