భార్య కావాలి.. ప్రియురాలూ కావాలి! ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి యువకుడి హైడ్రామా

పతనంతిట్ట: అలిగి వెళ్ళిపోయిన భార్య తిరిగి రావాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన వింత ఘటన కేరళలో చోటుచేసుకుంది. తన భార్య ఇంటి ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి అతను ఈ హంగామా సృష్టించాడు.

వార్యాపురానికి చెందిన ఆరోమల్ (23) అనే యువకుడు ఈ పనికి ఒడిగట్టాడు. అసలు విషయం ఏమిటంటే, ఆరోమల్ తన ఏడు నెలల గర్భిణీ అయిన ప్రియురాలిని ఇంటికి తీసుకువచ్చి తనతో పాటే ఉంచుకున్నాడు. భర్త చేసిన ఈ పనికి విసిగిపోయిన భార్య, అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇకపై తాను తిరిగి రానని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది.

దీంతో తట్టుకోలేకపోయిన ఆరోమల్, ఆదివారం రాత్రి భార్య ఇంటి ముందున్న 11 KV విద్యుత్ లైన్ వెళ్లే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. తన భార్య రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ శాఖకు సమాచారం అందించడంతో పవర్ కట్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు కలిసి రాత్రంతా అతనితో చర్చలు జరిపి, నచ్చజెప్పారు. చివరకు తెల్లవారుజామున అతను సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Posted

in

by

Tags: