“భార్య కోపాన్ని తగ్గించేందుకు కొత్త కారు..!” కారును దొంగిలించి భార్యకు కల్లబొల్లి కబుర్లు చెప్పిన భర్త.. చివరకు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి.. నకిలీ నంబర్ ప్లేట్‌తో దొరికిపోయిన వైనం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అలిగిన తన భార్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ఓ వ్యక్తి కారును దొంగిలించిన విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.

భార్యతో వచ్చిన మనస్పర్థలను పరిష్కరించి, ఆమెను సంతోషపెట్టడానికే తాను ఈ సాహసానికి ఒడిగట్టినట్లు అరెస్టయిన నిందితుడు పేర్కొన్నాడు.

ఘజియాబాద్‌కు చెందిన ఓ యువ టాటూ ఆర్టిస్ట్, సెప్టెంబర్ 12న నోయిడా సెక్టార్ 18లోని పార్కింగ్ స్థలంలో తన హ్యుందాయ్ ఎక్సెంట్ (Hyundai Xcent) కారును పార్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి కారు కనిపించకపోవడంతో షాక్ తిన్న బాధితుడు, వెంటనే సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసుల దర్యాప్తులో, నోయిడాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎటా జిల్లాకు చెందిన అరుణ్ (22) అనే వ్యక్తే ఆ కారును దొంగిలించినట్లు తేలింది. పార్కింగ్‌లో ఉన్న కారును ఎత్తుకెళ్లిన అరుణ్, దానికి నకిలీ నంబర్ ప్లేట్‌ను తగిలించాడు. అనంతరం ఎటాలో ఉన్న తన భార్య దగ్గరికి కారును నడుపుకుంటూ వెళ్లి, తానే స్వయంగా కొత్త కారు కొన్నానని నమ్మబలికాడు.

పోలీసులు కేసు నమోదు చేసి తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న అరుణ్, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తన సోదరి ఇంటికి పారిపోయాడు. అయినప్పటికీ, నిఘా వర్గాలు, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సహాయంతో సెప్టెంబర్ 13న డీఎల్‌ఎఫ్ (DLF) మాల్ సమీపంలో పోలీసులు అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.

అరెస్టయిన అరుణ్ వద్ద నుంచి చోరీకి గురైన హ్యుందాయ్ ఎక్సెంట్ కారుతో పాటు నకిలీ నంబర్ ప్లేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలైన నంబర్ ప్లేట్‌ను కారు డిక్కీలో దాచి ఉంచినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: