మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాలో, తన భార్య ప్రసవానికి (డెలివరీ) అయిన వైద్య ఖర్చులను భరించేందుకు ఓ మహిళను హత్య చేసి, ఆమె బంగారు ఆభరణాలను అపహరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అక్టోబర్ 8వ తేదీన తిరోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో గేదెలను మేపేందుకు వెళ్లిన కేలన్బాయ్ దుర్గర్ (53) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె చెవి కమ్మలు, మంగళసూత్రం తదితర బంగారు ఆభరణాలు కూడా కనిపించకపోవడంతో, పోలీసులు దీనిని హత్య మరియు దోపిడీ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనలో నిందితుడెవరో మొదట్లో తెలియకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో జామ్రాపానీ ప్రాంతానికి చెందిన రూపేష్ మార్కమ్‌పై వారికి అనుమానం వచ్చింది. ఇదే క్రమంలో పొన్కట్టా ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో జరిగిన నగలు చోరీ ఘటనకు సంబంధించి కూడా రూపేష్‌ను పోలీసులు విచారించారు. అప్పుడు లభించిన సమాచారం ఆధారంగా, కేలన్బాయ్ హత్య కేసులోనూ అతనికి ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల విచారణలో కేలన్బాయ్ను తానే హత్య చేసి ఆమె బంగారు నగలు లాక్కున్నట్లు రూపేష్ అంగీకరించాడు. ఆ తర్వాత ఆ నగలను ఓ నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లి రూ.25 వేలకు కుదవ పెట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు రూపేష్‌ను అరెస్ట్ చేసి, కుదవ పెట్టిన నగలను కూడా రికవరీ చేశారు. మొదట ఒక సాధారణ దొంగతనం కేసులో దొరికిన సమాచారమే, చివరకు ఓ మహిళ హత్యోదంతం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది.
బాలాఘాట్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఆదిత్య మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. రూపేష్ భార్యకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కాగా, సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చయింది. ఆ డబ్బును సర్దుబాటు చేసేందుకే అతను మొదట దొంగతనానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత మహిళను చంపి నగలు లాక్కున్నాడని విచారణలో తేలింది. తిరోడి ప్రాంతంలో దినసరి కూలీగా పనిచేస్తున్న రూపేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఈ హత్యకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
