ఒక ప్రేమ వివాహం, అక్రమ సంబంధం, విషప్రయోగం.. చివరికి నిద్రిస్తున్న భర్త ముఖంపై యాసిడ్ దాడి! ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి, నిందితురాలు కహ్కశా (30)కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో ఆమెకు రూ. 1.75 లక్షల జరిమానా కూడా విధించారు.
ఏం జరిగింది? 2019లో కహ్కశా, ముజఫర్ అలీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముజఫర్ కూలీగా పనిచేస్తుండగా, ఆమె గృహిణిగా ఉండేవారు. అయితే, కహ్కశాకు పరిసర ప్రాంతాల్లోని ఒక యువకుడితో అక్రమ సంబంధం ఉందని ముజఫర్ గుర్తించడంతో గొడవలు మొదలయ్యాయి.
ఆ రోజు ఉదయం ఏం జరిగింది? మార్చి 7, 2025న ఉదయం ముజఫర్ తన భార్యను, ఆమె ప్రియుడిని ఒకే గదిలో అభ్యంతరకర స్థితిలో చూశాడు. అతను గట్టిగా అరవడంతో ప్రియుడు పారిపోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, స్థానికులు సర్దిచెప్పి పంపారు.
యాసిడ్ దాడి: ఆ రాత్రి ముజఫర్ నిద్రిస్తుండగా, కహ్కశా అతని ముఖంపై నేరుగా యాసిడ్ పోసింది. బాధితుడు నొప్పిని భరించలేక అరుస్తుండగా, ఆమె వదలకుండా బకెట్లో ఉన్న మిగిలిన యాసిడ్‌ను మగ్‌తో అతని ముఖంపై, కళ్లపై పోసింది. దీనివల్ల అతని కళ్లు పూర్తిగా దెబ్బతిని, అతను శాశ్వతంగా చూపు కోల్పోయాడు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సుమారు ఆరు నెలల పాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, చూపును తిరిగి పొందలేకపోయాడు.
అంతకుముందే విష ప్రయోగం: యాసిడ్ దాడికి ఒక రోజు ముందు (మార్చి 6, 2025న) తన భర్తకు ఆహారంలో విషం కలిపి చంపడానికి కహ్కశా ప్రయత్నించిందని, దీనికి ఆమె కుటుంబ సభ్యులు సహకరించారని ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది. అయితే, దీనిపై విడిగా కేసు నమోదు కాలేదు.
కోర్టు తీర్పు: సంవత్సరం పాటు సాగిన విచారణ అనంతరం, అదనపు జిల్లా జడ్జి గోపాల్ మే 27న ఆమెను దోషిగా తేల్చారు. సోమవారం ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. తీర్పు విన్న కహ్కశా కోర్టులోనే కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు.
