పెళ్లి, కుటుంబ జీవితంపై సంప్రదాయ ఆలోచనలు మారుతున్న నేపథ్యంలో, ఓ భారతీయ యువకుడు తన వివాహం విషయంలో వెల్లడించిన విభిన్నమైన కోరిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఉద్యోగానికి వెళ్లి కుటుంబానికి ప్రధాన ఆదాయాన్ని సంపాదించాలని, తాను ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకోవాలనుకుంటున్నట్లు అతను రెడిట్ (Reddit) వేదికగా పోస్ట్ చేశాడు.
భారతీయ మహిళలకు సంబంధించిన చర్చలు జరిగే ఓ రెడిట్ గ్రూపులో, కుటుంబ ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెతుకుతున్నట్లు అతను పేర్కొన్నాడు. భార్య తనకు నచ్చిన ఉద్యోగం, వృత్తి లేదా నచ్చిన ప్రదేశంలో పనిచేసుకోవచ్చని, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం సహా అన్ని ఇంటి పనులను తానే చూసుకుంటానని తెలిపాడు.
అంతేకాకుండా, పెళ్లి తర్వాత పిల్లలను కనే ఆలోచన తనకు లేదని, ప్రేమ, గౌరవం మరియు సమానత్వం ఆధారంగా వైవాహిక జీవితం సాగాలని అతను అభిప్రాయపడ్డాడు. తన పోస్టులో, తన ఎత్తు 6 అడుగులని, మంచి ఫిట్నెస్తో ఉన్నానని, తన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల నుంచి రిటైర్ అయి పెన్షన్ పొందుతున్నారని తెలిపాడు. అదే సమయంలో, తనను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ఏడాదికి కనీసం రూ. 12 లక్షలు సంపాదించాలనే షరతును కూడా పెట్టాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో రెడిట్ యూజర్లు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పురుషులు కూడా ఇంటి బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు రావడం మంచి మార్పు అని కొందరు ప్రశంసించారు. అదే సమయంలో, భార్య ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే అంగీకరిస్తారా? తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నడిపి పొదుపు చేయగలరా? ముఖ్యమైన నిర్ణయాలను భార్యే తీసుకుంటే ఒప్పుకుంటారా? వంటి ప్రశ్నలను మరికొందరు లేవనెత్తారు. దీంతో, వైవాహిక జీవితంలో ఆదాయం, ఇంటి పనులను పంచుకోవడంపై నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది.

Leave a Reply