హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్ ప్రాంతంలో మానవత్వానికి, మూగజీవాలకు ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఒక హృదయ విద్యావకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్డకట్టే చలిలో మనుషులు బయటకు రావడానికే భయపడే పరిస్థితుల్లో, ఒక విశ్వాసపాత్రమైన కుక్క భారీ హిమపాతం మధ్య నాలుగు రోజుల పాటు తన మరణించిన యజమాని మృతదేహాన్ని విడిచిపెట్టకుండా కాపలా కాసింది.
అసలేం జరిగింది? భర్మౌర్‌లోని ఎత్తైన పర్వత ప్రాంతంలో భర్మాణి మాత ఆలయం సమీపంలో ఒక యువకుడు విపరీతమైన చలి, మంచు కారణంగా మరణించాడు. నాలుగు రోజుల తర్వాత సహాయక బృందం మరియు స్థానికులు అక్కడికి చేరుకున్నప్పుడు, వారు చూసిన దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. ఆ వ్యక్తి మృతదేహం మంచుతో కప్పబడి ఉంది, కానీ అతని పెంపుడు కుక్క మాత్రం అక్కడే కదలకుండా కూర్చుని ఉంది. ఈ నాలుగు రోజులు ఆ మూగజీవి ఏమీ తినలేదు, తాగలేదు. కేవలం హిమపాతాన్ని తట్టుకోవడమే కాకుండా, అడవి జంతువుల నుండి తన యజమాని శరీరాన్ని రక్షించింది.
షాక్‌కు గురైన రెస్క్యూ టీమ్: సహాయక బృందం మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, ఆ కుక్క మొదట వారిపైకి దూకడానికి ప్రయత్నించింది. ఎవరో తన యజమానికి హాని చేయడానికి వచ్చారని అది భావించింది. వారు సహాయం చేయడానికి వచ్చారని గ్రహించిన తర్వాతే అది అక్కడి నుండి తప్పుకుంది. ఈ ఘటన జపాన్‌కు చెందిన ప్రసిద్ధ ‘హాచికో’ కథను గుర్తుకు తెస్తోంది.
