“మగాళ్లను కూడా వదలరా రా..?” 2 గంటల పాటు వెంటాడిన పురుషులు.. రాత్రి వేళ స్త్రీ వేషంలో వెళ్లిన యువకుడు.. భయంతో ప్రయోగాన్ని విరమించుకున్న యూట్యూబర్..!!

ఢిల్లీలో రాత్రి వేళ ఒంటరిగా వెళ్లేటప్పుడు మహిళలు ఎదుర్కొనే ప్రమాదాలను స్వయంగా తెలుసుకోవడానికి, ‘BeJaintle’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని నిర్వహించే యువకుడు స్త్రీ వేషంలో అర్ధరాత్రి స్కూటర్‌పై ప్రయాణించాడు.

తన ముఖాన్ని దుపట్టాతో కప్పుకుని అతను చేసిన ఈ ప్రయోగ ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ముక్కు మొహం తెలియని చాలా మంది పురుషులు అతని వైపే వింతగా చూడటం ప్రారంభించారు. అతను వెళ్లే దారి పొడవునా చాలా మంది వెంటపడటం, దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించడం లాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

అతను ప్రయాణించిన మార్గంలో వెళ్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు అతని స్కూటర్ దారికి అడ్డుగా వచ్చి తీవ్రంగా వేధించారు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఈ దృశ్యాలను షూట్ చేస్తున్నారని గ్రహించిన తర్వాతే ఆ ఆటో డ్రైవర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడికి తన భద్రత పట్ల భయం, అసౌకర్యం మరింత పెరిగాయి.

రోడ్డుపై రెండు గంటల పాటు ప్రయాణించిన తర్వాత తన అనుభవాన్ని పంచుకుంటూ, “రాత్రి వేళ ఆటోవాళ్లు, సైకిళ్లపై వెళ్లేవాళ్లు.. ఇలా అందరూ ఒక రకమైన చూపులతో చూస్తున్నారు; ఢిల్లీలో రాత్రి వేళ మహిళలు ఒంటరిగా ప్రయాణించడం ఎంతమాత్రం సురక్షితం కాదు” అని చెబుతూ భయం కారణంగా తన ప్రయోగాన్ని మధ్యలోనే విరమించుకున్నాడు.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఢిల్లీలో మహిళల భద్రతపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు ఇది ఢిల్లీలో మహిళల యథార్థ పరిస్థితికి అద్దం పడుతోందని మద్దతు తెలపగా, ఒక్కరి ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఒక నగర భద్రత మొత్తాన్ని అంచనా వేయలేమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *