వెనిజులా పరిణామాలపై చైనా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రెండోసారి నోరు విప్పింది. ఆదివారం ఉదయం జారీ చేసిన రెండో ప్రకటనలో బీజింగ్ స్పష్టమైన భాషలో హెచ్చరించింది— వెంటనే నికోలస్ మదురోను మరియు ఆయన భార్యను విడుదల చేయాలి. అదే సమయంలో వెనిజులాలో అధికార మార్పిడికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని కఠిన సందేశం పంపింది.
వెనిజులా గడ్డపైకి చొచ్చుకువెళ్లి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను అమెరికా దళాలు ఎత్తుకుపోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన
ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా దేశం దాటించడం ద్వారా అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు మరియు అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక సూత్రాలకు ఈ చర్య ఏమాత్రం పొంతన లేదని బీజింగ్ విమర్శించింది.
చైనా విదేశీ వ్యవహారాల ప్రతినిధి మాట్లాడుతూ.. “మదురో మరియు ఆయన భార్య వ్యక్తిగత భద్రతకు అమెరికాదే పూర్తి బాధ్యత. వెంటనే వారిని విడుదల చేయాలి. వెనిజులా ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదు. అన్ని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి” అని పేర్కొన్నారు.
డ్రామా సీన్: బెడ్ రూమ్ నుండి డిటెన్షన్ క్యాంప్ వరకు
శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెనిజులాలో జరిగిన నాటకీయ ఆపరేషన్ గురించి ప్రకటించారు. వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో మదురో దంపతులను వారి బెడ్ రూమ్ నుండే అమెరికా దళాలు పట్టుకున్నాయి. హెలికాప్టర్ ద్వారా వారిని మొదట అమెరికా యుద్ధనౌకకు, అక్కడి నుండి నేరుగా న్యూయార్క్‌కు తరలించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం వారిని బ్రూక్లిన్‌లోని ఒక డిటెన్షన్ క్యాంప్‌లో ఉంచారు. వైట్ హౌస్ దీనికి సంబంధించిన ఫుటేజీని కూడా విడుదల చేసింది. బందీగా మారిన తర్వాత మదురో కేవలం ఐదు పదాలతో స్పందించారు— “గుడ్ నైట్. హ్యాపీ న్యూ ఇయర్.”
చైనా తీవ్ర నిరసన
ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం రాత్రి చైనా తన మొదటి ప్రకటన విడుదల చేసింది. ఒక సార్వభౌమ దేశంపై ఇలా సైనిక శక్తిని ప్రయోగించి, అధ్యక్షుడిని అపహరించడాన్ని తీవ్రంగా ఖండించింది. “ఇది అచ్చమైన ఆధిపత్య ధోరణి. అంతర్జాతీయ చట్టాలు, వెనిజులా సార్వభౌమాధికారం మరియు లాటిన్ అమెరికా ప్రాంత భద్రతపై ఇది ప్రత్యక్ష దాడి. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది” అని పేర్కొంది.
ఆ తర్వాత కొద్ది గంటలకే రెండో ప్రకటన జారీ చేస్తూ బీజింగ్ తన స్వరాన్ని మరింత పెంచింది. మదురోను బంధించి ప్రభుత్వం మార్చాలనే ఆటలు ఆడితే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికాను హెచ్చరించింది.
