ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మద్యం దుకాణం ముందు జరిగిన చిన్న గొడవ చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సదర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం ముందు సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూపేంద్ర అహిర్వార్ అనే యువకుడికి కొందరు యువకులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న కొందరు యువకులకు, భూపేంద్రకు మధ్య ఏదో విషయంపై గొడవ మొదలైంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఐదుగురు కలిసి భూపేంద్రపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడి సమయంలో అతడిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు కత్తితో కూడా పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన భూపేంద్రను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిని గమనించిన మద్యం దుకాణం సిబ్బందిలో ఒకరు భూపేంద్రను కాపాడేందుకు ప్రయత్నించగా.. దుండగులు అతడిపైనా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూపేంద్ర పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply