మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో మద్యం మత్తులో ఓ పోలీస్ అధికారి ప్రజలతో గొడవకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
యూనిఫాంలో విధుల్లో ఉన్న ఆ పోలీస్ అధికారి.. మితిమీరిన మద్యం సేవించి నయాపురా ప్రాంతంలో హంగామా చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుణా పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న మనోజ్ వర్మ అనే పోలీస్ అధికారి.. సర్క్యూట్ హౌస్‌లో భద్రతా విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో విధుల నుంచి బయటకు వచ్చిన ఆయన నయాపురా ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.
అక్కడ కొందరు స్థానికులతో ఆయన గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన వద్ద ప్రభుత్వ తుపాకీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, గొడవ జరుగుతున్న సమయంలో ఆ తుపాకీని అక్కడే కింద పడేసినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మనోజ్ వర్మను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతూ హంగామా కొనసాగించినట్లు సమాచారం.
దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీస్ శాఖ దృష్టికి విషయం చేరింది.
దీనిపై గుణా జిల్లా ఎస్పీ హితికా వాసల్ వెంటనే చర్యలు తీసుకున్నారు. మనోజ్ వర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విధులకు గైర్హాజరు కావడం, ప్రజలతో అనుచితంగా ప్రవర్తించడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

Leave a Reply