మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో, పూణేలో జరిగిన సంచలన ‘కేతన్ అగర్వాల్’ హత్య కేసును మించిపోయేంత క్రూరమైన మరో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.
విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోల్మలా ప్రాంతానికి చెందిన ఆనంద్ హనుమంత్ సర్జే అనే యువకుడు, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఆనంద్కు మద్యపాన అలవాటు ఉందని, ఆ మత్తులో అతను తన భార్యను తరచూ కొడుతూ వేధించేవాడని తెలుస్తోంది. ఆ వేధింపులను తట్టుకోలేక, తన 23 ఏళ్ల ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న ఆ మహిళ, తన భర్తను అడ్డు తొలగించుకోవడానికి ఒక భయంకరమైన ప్లాన్ వేసింది.
పథకం ప్రకారం, అర్ధరాత్రి భర్తతో గొడవ జరిగిన తర్వాత, ఆ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి, నిద్రిస్తున్న ఆనంద్ కాళ్లను దుపట్టాతో కట్టేశారు. ఆపై అతని ఛాతీపై ఎక్కి కూర్చుని, గుండెను నొక్కి, గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశారు.
ఆ తర్వాత, ఆనంద్ నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని నమ్మించేందుకు నాటకమాడారు. తన సోదరుడి సహాయంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆనంద్ మెడపై ఉన్న గోళ్ల గాట్లను చూసి అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదికలో అది హత్య అని నిర్ధారణ కావడంతో, పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపి, ఆ మహిళను మరియు ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
