గుజరాత్‌లోని వడోదరలో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను మద్యం మత్తులో వాహనం నడిపినందుకు (Drunk and Drive) అకోటా పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం, జాకబ్ మార్టిన్ అకోటా దాండియా బజార్ బ్రిడ్జిపై తన ఎంజీ హెక్టార్ కారును నడుపుతుండగా, మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి రెండు మూడు వాహనాలను ఢీకొట్టారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న అకోటా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టగా, ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది.
గతంలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ మార్టిన్: ఏడేళ్ల క్రితం వడోదరలోనే జరిగిన ఒక ప్రమాదంలో మార్టిన్ లివర్ మరియు ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో చికిత్స కోసం ఆయన కుటుంబం వద్ద డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో బీసీసీఐ (BCCI), బరోడా క్రికెట్ అసోసియేషన్ మరియు పలువురు క్రికెటర్లు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
క్రికెట్ కెరీర్: జాకబ్ మార్టిన్ బరోడా క్రికెట్ అసోసియేషన్ అండర్-19 జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. భారత్ తరపున 1999 నుండి 2001 మధ్య 10 వన్డేలు ఆడిన ఆయన, 22.57 సగటుతో పరుగులు సాధించారు. 1999లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశారు. ఆయన కెప్టెన్సీలో వడోదర జట్టు 2000-2001 సీజన్లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. దేశవాళీ క్రికెట్లో బరోడా మరియు రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన మార్టిన్, 90వ దశకంలో మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు.
