మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతోంది. ఇరాన్-అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య పోరాటం నేడు 27వ రోజుకు చేరుకుంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో జరుగుతున్న నెల రోజుల నాటి యుద్ధంపై ఒక సంచలన ప్రక్రియ చేశారు.
యుద్ధాన్ని ముగించడానికి తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానని ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా, ఇరాన్ నాయకత్వం తనను అనధికారికంగా ఆ దేశానికి తదుపరి ‘సుప్రీం లీడర్’ (అత్యున్నత నాయకుడు) కావాలని ప్రతిపాదించిందని, అయితే తాను దానిని తిరస్కరించానని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ ఏమన్నారు? నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ (NRCC) నిధుల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. “ప్రపంచంలో ఇరాన్ దేశాధినేత కావాలని నాకంటే తక్కువగా కోరుకునే వ్యక్తి మరొకరు ఉండరు. వారు నన్ను తదుపరి సుప్రీం లీడర్ చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు, కానీ నేను- లేదు, ధన్యవాదాలు.. నాకు ఆ పదవి వద్దు అని చెప్పాను” అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ఇరాన్ నాయకత్వంపై అనిశ్చితి
గత నెలలో అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే యుద్ధం మొదలైనప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీనిపై స్పందించిన ట్రంప్, ఇరాన్ సైన్యం దాదాపు వినాశనం (Military Decimation) అంచున ఉందని, తాము విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
తెరవెనుక ఒప్పందాలు జరుగుతున్నాయా?
టెహ్రాన్‌తో రహస్య చర్చలు (Backchannel talks) జరుగుతున్నాయని, ఇరాన్ పాలకులు కాల్పుల విరమణ కోసం ఆరాటపడుతున్నారని ట్రంప్ నొక్కి చెప్పారు. “వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ తమ సొంత ప్రజలే తమను చంపేస్తారనే భయంతో బయటకు చెప్పలేకపోతున్నారు. అలాగే వారు మాకు కూడా భయపడుతున్నారు” అని ఆయన అన్నారు. అయితే, ఇరాన్ మాత్రం అధికారికంగా ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది.
అమెరికా 15-సూత్రాల ప్రతిపాదన ఏమిటి?
మీడియా నివేదికల ప్రకారం, వాషింగ్టన్ పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు 15 అంశాల శాంతి ప్రతిపాదనను పంపింది. అందులోని ప్రధాన షరతులు:
- ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం.
- హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఆపడం.
- ‘హార్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) తిరిగి తెరవడం.
ఇరాన్ ఘాటు స్పందన
ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫికారీ ప్రభుత్వ టీవీలో మాట్లాడుతూ ట్రంప్‌ను ఎద్దేవా చేశారు. “మీ అంతర్గత పోరాటం ఏ స్థాయికి చేరుకుందంటే.. మీరు (ట్రంప్) మీతో మీరే చర్చలు జరుపుకుంటున్నారు. మాలో ఎవరూ మీతో ఒప్పందం చేసుకోరు” అని మండిపడ్డారు. అంతేకాకుండా, ఇరాన్ తన సొంత 5-సూత్రాల ప్రతిపాదనను సిద్ధం చేసిందని, యుద్ధం తమ షరతులపైనే ముగుస్తుందని స్పష్టం చేసింది.
