మహారాష్ట్రలోని లోనావాలాలో ఆస్తి వివాదం కారణంగా 33 ఏళ్ల న్యాయవాది తుపాకీ కాల్పుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ కేసులో మృతుడి 83 ఏళ్ల తాతపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూషి గ్రామంలోని ఒక హోటల్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడిని అభయ్ మాణిక్ మరాఠేగా గుర్తించారు. ఆయన తాత మోతీరామ్ రాజీవ్ మరాఠే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సంఘటన సమయంలో తుపాకీ గుండు ఛాతీలోకి దూసుకెళ్లడంతో అభయ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మొదట్లో తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు బుల్లెట్ పేలి ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు చెప్పినట్లు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు ప్రారంభంలో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. అయితే అనంతరం జరిపిన విచారణలో, అభయ్ శరీరానికి తగిలిన గాయంపై వచ్చిన వైద్య నివేదికలో (Medical Report) కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. బుల్లెట్ అతి సమీపం నుంచి ఛాతీలోకి దూసుకెళ్లిందనే అనుమానం పోలీసులకు కలిగింది. దాంతో, ఇది నిజంగా ప్రమాదమా లేదా పక్కా ప్రణాళికతో జరిపిన కాల్పులా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కుటుంబంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదా పోలీసుల దృష్టికి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మోతీరామ్ మరాఠే తన ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించాలని భావించగా, అందుకు మనవడు అభయ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన రోజున కూడా ఇద్దరి మధ్య ఆస్తి, భూమి వ్యవహారమై తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, మోతీరామ్ వద్ద ఎప్పటినుంచో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉన్నట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన తర్వాత హోటల్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్ (DVR) అదృశ్యం కావడం పోలీసుల అనుమానాలను మరింత బలపరిచింది. ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని, హోటల్ సిబ్బందిని బెదిరించారని కూడా పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఈ కేసు ప్రమాదవశాత్తు జరిగిన మరణం నుంచి హత్య కేసుగా మారింది. 83 ఏళ్ల మోతీరామ్ మరాఠేతో పాటు కుటుంబంలోని మరికొందరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ డీవీఆర్ అదృశ్యం కావడం, కాల్పులు జరిగిన తీరు, అంతకుముందు జరిగిన గొడవ తదితర అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. వైద్య నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ ఘటన వెనుక ఉన్న ఆస్తి వివాదం వెలుగులోకి రావడంతో సమగ్ర విచారణ కొనసాగుతోంది.

Leave a Reply