ఖరీదైన కారు లేదు, పెద్ద ఇల్లు లేదు, విలాసవంతమైన జీవితం అసలే లేదు. అయినప్పటికీ, ఒకే సైకిల్‌పై భార్య, భర్త, చిన్నారి.. ముగ్గురూ కలిసి ప్రయాణిస్తున్న దృశ్యం ఇంటర్నెట్లో ఎంతోమంది మనసులను కదిలిస్తోంది.
రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పాత సైకిల్‌పై ముందు చిన్నారి, మధ్యలో భర్త, వెనుక భార్య కూర్చుని ఉన్నారు. అనంతరం ముగ్గురూ కలిసి ఆ సైకిల్‌పై అక్కడి నుంచి బయలుదేరారు. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో.. జీవితంలో నిజమైన ఆనందం అనేది ఖరీదైన వస్తువులలో మాత్రమే కాకుండా, ప్రేమగల ఆత్మీయ బంధాలతో గడిపే క్షణాల్లోనే ఉంటుందని గుర్తుచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @thakur_shrishtii అనే ఖాతాలో షేర్ చేశారు. రాత్రి సమయంలో రోడ్డుపై వాహనాలు తిరుగుతుండగా, వీధిదీపాల వెలుతురులో ఈ కుటుంబం సైకిల్‌తో నిలబడి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. సైకిల్ ముందు రాడ్‌పై కూర్చున్న చిన్నారి హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకుని ఉండగా, మధ్యలో భర్త సైకిల్ తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. వెనుక సీటులో భార్య కూర్చుని ఉన్నారు. కాసేపు రోడ్డు వైపు చూసి, ఆ తర్వాత ముగ్గురూ కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ నిరాడంబరమైన దృశ్యమే అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆడంబరమైన జీవితం లేదా ఖరీదైన వస్తువులు లేకపోయినా భార్యాభర్తలు, చిన్నారి కలిసి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తున్నారని ఈ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా, కొన్నిసార్లు తక్కువ ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలలోనే ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం కూడా ఇందులో వ్యక్తమైంది. మన వద్ద ఎన్ని వస్తువులు ఉన్నాయనే దానికంటే, మనతో ఉన్నవారితో ఎంత ప్రేమను పంచుకుంటున్నామనేదే నిజమైన సంతోషాన్ని నిర్ణయిస్తుందనే మాట నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
ఈ వీడియోను చూసిన చాలామంది తమ బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. నాన్న సైకిల్ ముందు భాగంలో కూర్చుని తిరిగిన రోజులే తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలని కొందరు భావోద్వేగంతో కామెంట్ చేస్తున్నారు. నేడు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆ కాలంలో ఉన్న ప్రశాంతత దొరకడం లేదని మరికొందరు పేర్కొంటున్నారు. అదే సమయంలో, పేదరికాన్ని అందంగా చిత్రీకరించకూడదని, చిన్నారిని హెల్మెట్ లేకుండా సైకిల్‌పై ప్రమాదకర రీతిలో కూర్చోబెట్టడం సురక్షితం కాదని మరో వర్గం నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య ఈ వీడియో మరింతగా చర్చనీయాంశమవుతోంది.

Leave a Reply