చైనాలోని చెంగ్డూ (Chengdu) నగరంలో ప్రముఖ గాయకుడు వాంగ్ లీహోమ్ (Wang Leehom) నిర్వహించిన సంగీత కచేరీలో, అచ్చం మనుషుల రూపంలో ఉన్న 6 హ్యూమనాయిడ్ రోబోలు (Humanoid Robots) స్టేజ్ పై ప్రత్యక్షమై తమ డాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
వెండి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ రోబోలు, గాయకుడి ‘Open Fire’ అనే పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ, కాళ్లతో స్టెప్పులు వేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో డాన్స్ చేశాయి. ఇవి యంత్రాల్లా కాకుండా, నిజమైన బ్యాక్-అప్ డాన్సర్ల లాగే డాన్స్ చేయడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యంతో కేకలు వేశారు.
ఈ ప్రదర్శనలో హైలైట్ ఏమిటంటే, ఆరు రోబోలు ఏకకాలంలో ‘వెబ్‌స్టర్ ఫ్లిప్’ (Webster Flip) అని పిలిచే గాలిలో గంతేసే (బ్యాక్ ఫ్లిప్) సాహసాన్ని చేసి చూపించాయి. ‘యూనిట్రీ రోబోటిక్స్’ (Unitree Robotics) అనే సంస్థ తయారు చేసిన ఈ రోబోల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, “చాలా బాగుంది” (Impressive) అంటూ ప్రశంసించారు. కేవలం డాన్స్‌తోనే ఆగకుండా, కష్టతరమైన సర్కస్ సాహసాలను కూడా రోబోలు చేయడం చూస్తుంటే, వినోద రంగం భవిష్యత్తు ఇక రోబోల చేతుల్లోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.
