“మనుషులపై పడ్డది చాలదన్నట్లు ఇప్పుడు మూగజీవాల పైనా..?” 130 మందిని కరిచి పిప్పి చేసిన కుక్కలు.. వీధి కుక్కల కోరల్లో గ్రామాలు.. హడలిపోతున్న జనం!

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా కారంజా (Karanja) పట్టణంలో రోజురోజుకూ మితిమీరిపోతున్న వీధి కుక్కల బెడద స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

సాధారణంగా మనుషులు, చిన్నపిల్లలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే ఈ వీధి కుక్కలు.. ఇప్పుడు పెంపుడు జంతువులు, పశువులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోకి హఠాత్తుగా గుంపుగా వచ్చిన 4 నుండి 5 కుక్కలు ఒక మేకను వెంటాడి దారుణంగా దాడి చేశాయి.

ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే కాదు, తమ పిల్లలను, మూగజీవాలను బయటకు పంపేందుకు కూడా తీవ్రంగా భయపడుతున్నారు. పట్టణంలో నానాటికీ పెరిగిపోతున్న వీధి కుక్కల సంఖ్యను అదుపు చేయాలని, అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ కుక్కల స్వైరవిహారం తారాస్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం థానే ప్రాంతంలో ఒక పిచ్చి కుక్క కేవలం 7 గంటల వ్యవధిలోనే ఏకంగా 130 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇలాంటి వరుస ఘటనలు మహారాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలను, భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *