చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న దశాంగ్షాన్ ద్వీపం వద్ద గత ఏప్రిల్‌లో గాయాలతో ఐదు సముద్రపు సీల్‌లను రక్షించారు. వాటిలో ‘నానా’ అనే రెండేళ్ల మచ్చలున్న సీల్ కూడా ఉంది.
కొన్ని నెలల పాటు పరిశోధకులు, స్థానిక ప్రజలు నానాను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. చికిత్సతో పూర్తిగా కోలుకున్న తర్వాత.. ఈ నెల 7న దాన్ని సముద్రంలోకి తిరిగి వదిలారు.
మళ్లీ మనుషుల దగ్గరకే..
సముద్రంలోకి వెళ్లిన నానా.. అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా మళ్లీ మనుషుల కోసం ప్రయాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
సుమారు ఆరు రోజుల పాటు ఈదుకుంటూ.. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి, ఈ నెల 13న తిరిగి అదే దశాంగ్షాన్ ద్వీపం తీరానికి చేరుకుంది.
నానా శరీరానికి అమర్చిన GPS ట్రాకింగ్ పరికరం ద్వారా అది దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ తిరిగి వచ్చిన విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.
మళ్లీ నానాను చేరదీసిన స్థానికులు
సుదీర్ఘ ప్రయాణం కారణంగా నానా బాగా నీరసంగా కనిపించింది. దాన్ని గుర్తించిన స్థానిక మత్స్యకారులు, పరిశోధకులు సంతోషంతో దానికి ఆహారం అందించి మళ్లీ సంరక్షణలోకి తీసుకున్నారు.
చైనాలో అత్యంత రక్షిత జంతువుల జాబితాలో ఉన్న ఈ మచ్చల సముద్రపు సీల్ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మనుషులతో ఏర్పడిన అనుబంధం కారణంగానే నానా మళ్లీ అదే ప్రాంతానికి చేరుకుందా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. 200 కిలోమీటర్లు ఈదుకుంటూ తిరిగి రావడం మాత్రం జంతు ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది.

Leave a Reply