అమెరికాలో 9 మందితో ప్రయాణిస్తున్న ఓ చిన్న తరహా ప్రైవేట్ విమానం.. దక్షిణ ఫ్లోరిడా నివాస ప్రాంతంలో నిలువుగా కుప్పకూలి, పేలిపోవడంతో విమానంలో ఉన్న 9 మంది దుర్మరణం పాలయ్యారు.
ఆస్టిన్ (Austin) నుంచి బహామాస్ (Bahamas) దీవులకు వెళ్తున్న ఆ విమానం, పామ్ బీచ్ (Palm Beach) కౌంటీలోని క్రెస్ట్‌హావెన్ (Cresthaven) ప్రాంతం సమీపంలో ఇళ్లకు అత్యంత దగ్గరగా ఉన్న రోడ్డుపై పడిపోయి ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఆకాశం నుంచి విమానం అతివేగంగా నేలవైపు దూసుకొచ్చి, భారీ శబ్దంతో పేలిపోయిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫ్ఫీ (Sean Duffy) తన ‘ఎక్స్’ (X) ఖాతాలో అధికారికంగా ధృవీకరించారు.
విమాన పైలట్ కంట్రోల్ రూమ్‌తో జరిపిన సంభాషణలు తాజాగా విడుదలై మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అందులో, ‘విమానం నిమిషానికి 20,000 అడుగుల వేగంతో కిందకు పడిపోతోంది, మేము నేలను ఢీకొట్టబోతున్నాం’ అని పైలట్ వేసిన కేకలు, చివరగా ఒక మహిళా సిబ్బంది ‘మన సమయం అయిపోయింది’ అని ప్రాణభయంతో అరిచిన అరుపులు రికార్డయ్యాయి.
మొదట తేలికపాటి మంచు, ప్రతికూల వాతావరణం ఉందని కంట్రోల్ రూమ్‌కు తెలిపిన పైలట్లు.. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే అదుపు తప్పి ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంస్థలు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నాయి.

Leave a Reply