ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిణి మరోసారి సంచలన భవిష్యవాణిని వినిపించారు. 2026 పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆయన అంచనాలు వేశారు. ఈ మేరకు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పలు ఆసక్తికర పోస్ట్‌లను పంచుకున్నారు. తమిళనాడులో ఇప్పటికే పోలింగ్ ముగియగా, పశ్చిమ బెంగాల్‌లో ఒక దశ పోలింగ్ పూర్తయ్యింది. ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.
మమతా బెనర్జీపై జోస్యం: ‘దీదీ’ అధికారం కోల్పోతారా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రశాంత్ కిణి పేల్చిన బాంబు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2023లో ఆయన చేసిన పాత పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ.. “మమతా బెనర్జీకి ఫిబ్రవరి 2024 వరకు అనుకూల సమయం లేదు. మార్చి 2024 నుండి ఏప్రిల్ 2026 వరకు చాలా మంచి సమయం ఉంటుంది, దీనివల్ల 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ మంచి ప్రదర్శన ఇస్తుంది” అని గతంలోనే చెప్పారు. అయితే, ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవబోరని ఆయన కుండబద్దలు కొట్టారు.
బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోతారని, ఆమె ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోతారని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌లో నమోదైన భారీ పోలింగ్ మమత పతనానికి సంకేతమని, “ఫలితాలు దేశాన్నే ఆశ్చర్యపరుస్తాయి” అని ఆయన రాసుకొచ్చారు.
తమిళనాడు ఎన్నికలపై అంచనాలు: డీఎంకే + టీవీకే కూటమి? తమిళనాడు రాజకీయాలపై కూడా ప్రశాంత్ కిణి తన జోస్యం చెప్పారు. 2026లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని, కానీ ఓట్లు మరియు సీట్లు భారీగా తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. ఎం.కె. స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది కూటమి ప్రభుత్వం లేదా బయటి పార్టీ మద్దతుతో జరుగుతుందని పేర్కొన్నారు.
మరీ ముఖ్యంగా, తమిళనాడుకు డీఎంకే కాకుండా వేరే పార్టీ నుండి ఉప ముఖ్యమంత్రి వస్తారని ఆయన స్పష్టం చేశారు. “తమిళనాడులో డీఎంకే + టీవీకే (విజయ్ పార్టీ)” ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీ పూర్తిగా పతనమవుతుందని, బీజేపీకి సీట్లు మరియు ఓట్ల శాతం పెరుగుతుందని స్ఫోటక భవిష్యత్తును వినిపించారు.
భారీ పోలింగ్ నమోదు:
- తమిళనాడు: ఏప్రిల్ 23న ఒకే విడతలో 234 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 85.13% ఓటింగ్ నమోదైంది. మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లలో సుమారు 4.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- పశ్చిమ బెంగాల్: మొత్తం 294 నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు ప్రకటించగా, ఏప్రిల్ 23న మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అత్యధికంగా 92.59% ఓటింగ్ నమోదైంది.
తదుపరి దశ: పశ్చిమ బెంగాల్‌లో మిగిలిన 142 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఈ రెండు రాష్ట్రాల తుది ఫలితాలు మే 4వ తేదీన విడుదల కానున్నాయి.
