పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం శాసనసభను రద్దు చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు గవర్నర్‌ను కలిసే సంప్రదాయాన్ని తాను పాటించబోనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఆమె అధికారికంగా రాజీనామా చేయకపోవడంతో, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమెను ఆపద్ధర్మ (Caretaker) ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరే అవకాశం గవర్నర్‌కు లేకుండా పోయింది.
కోల్‌కతాలోని రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం: “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2లోని సబ్-క్లాజ్ (బి) ప్రకారం గవర్నర్‌కు కల్పించబడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి మే 7, 2026 నుండి అమలులోకి వచ్చేలా అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.”
పాత అసెంబ్లీ పదవీకాలం ముగిసిన రెండు రోజులకు, అంటే మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని బిజెపి నాయకులు సూచించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు గవర్నరే రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా ఉంటారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. హిందూ ఓటర్ల ఏకీకరణ, మమత కంచుకోట అయిన దక్షిణ బెంగాల్‌లోకి చొచ్చుకుపోవడం, అవినీతిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరియు 15 ఏళ్ల అధికార వ్యతిరేకత బిజెపికి కలిసి వచ్చాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ తన సొంత స్థానమైన భవానీపూర్‌లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మొత్తం 207 స్థానాల్లో బిజెపి విజయం సాధించగా, టిఎమ్‌సి 80 స్థానాలకే పరిమితమైంది. ఫలితాల అనంతరం మమత మాట్లాడుతూ.. కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం బిజెపికి సహకరించాయని ఆరోపించారు. “మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, అలాంటప్పుడు నేను రాజ్‌భవన్‌కు ఎందుకు వెళ్లాలి? నేను ప్రమాణ స్వీకారం చేయడం లేదు, మరి రాజీనామా ఎందుకు చేయాలి? ఇది మమ్మల్ని ఓడించడానికి వారు చేసిన బలవంతపు ప్రయత్నం. మా పోరాటం బిజెపితో కాదు, ఎన్నికల సంఘంతో,” అని ఆమె మంగళవారం పేర్కొన్నారు.
ఆమె రాజీనామా చేయకపోవడం ప్రజాస్వామ్యంలో ఒక “నిరసన రూపం” అని టిఎమ్‌సి ప్రతినిధి కునాల్ ఘోష్ బుధవారం సమర్థించుకున్నారు.
