మధ్యప్రదేశ్ రాష్ట్రం, గ్వాలియర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక స్థానిక చీరల దుకాణంలో పనిచేస్తోంది.
అవద్పురా ప్రాంతానికి చెందిన ఈమెకు, ఇషాన్ ఖాన్ అనే యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది. అయితే, ఇషాన్ మరో యువతితో చనువుగా ఉండటం, మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూస్తుండటంతో, ఆమె ఇషాన్‌ను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇషాన్, తన బంధువైన అర్బాజ్ ఖాన్‌తో కలిసి ఆమెను హతమార్చడానికి పథకం వేశాడు. స్నేహితుడి వద్ద నుంచి బాలెనో కారును అద్దెకు తీసుకున్న వీరు, గత ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి క్యాన్సర్ హిల్స్ అనే కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, తననే పెళ్లి చేసుకోవాలని ఇషాన్ ఆమెను తీవ్రంగా వేధించాడు. అందుకు ఆ బాలిక నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
గొడవ ముదరడంతో అర్బాజ్ బాలిక చేతులను గట్టిగా పట్టుకోగా, ఇషాన్ ఆమె చున్నీతోనే (దుపట్టా) గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇషాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌లను పోలీసులు 12 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Leave a Reply