మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరగా, ఇప్పుడు ఈ యుద్ధ రంగంలోకి మరో దేశం దూకేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహును ఆధునిక కాలపు ‘హిట్లర్’ అని అభివర్ణిస్తూ తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అవసరమైతే ఇజ్రాయెల్‌పై సైనిక దాడికి కూడా వెనుకాడబోమని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
నెతన్యాహు ఒక ‘రక్తపిపాసి’.. ఎర్డోగాన్ నిప్పులు
అంకారాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ.. నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“రక్తం రుచి మరిగిన నెతన్యాహు ద్వేషంతో గుడ్డివాడైపోయాడు. చరిత్రలో ఆయన పేరు హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్ వంటి నియంతల పక్కన నిలుస్తుంది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తోంది పక్కా వంశహత్య. దీనికి నెతన్యాహు ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిందే.” అని ఎర్డోగాన్ మండిపడ్డారు.
సైనిక చర్యకు సిద్ధమన్న తుర్కియే అధ్యక్షుడు!
గతంలో లిబియా, నాగూర్నో-కరబాఖ్ వివాదాల్లో తుర్కియే సైన్యం ఎలాగైతే జోక్యం చేసుకుందో.. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తామని ఎర్డోగాన్ హెచ్చరించారు. “ఇజ్రాయెల్ తన ఇష్టానుసారం దాడులు చేయకుండా అడ్డుకోవడానికి మేము అక్కడికి (ఇజ్రాయెల్‌లోకి) ప్రవేశిస్తాం” అని ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరో మలుపు తిరుగుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటికే గాజాపై దాడులకు నిరసనగా ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తుర్కియే రద్దు చేసుకుంది.
సద్దాం హుస్సేన్ గతి పడుతుంది: ఇజ్రాయెల్ కౌంటర్
ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతే ఘాటుగా స్పందించింది. ఎర్డోగాన్ ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ బాటలో నడుస్తున్నారని, సద్దాం చివరకు ఏ గతి పట్టారో ఎర్డోగాన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.
ముంచుకొస్తున్న ముప్పు!
గాజా తర్వాత ఇప్పుడు లెబనాన్‌పైకి యుద్ధాన్ని వ్యాపింపజేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం ప్రాంతీయ శాంతిని ముప్పులో పడేస్తుందని తుర్కియే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఎర్డోగాన్ విమర్శించారు. ఒకవైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నడుస్తుండగా.. ఇప్పుడు నాటో (NATO) సభ్య దేశమైన తుర్కియే కూడా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి కాలుదువ్వుతుండటంతో పశ్చిమ ఆసియా అగ్నిగుండంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
