మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (IIFM) ప్రాంగణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.పి. శ్రీవాస్తవ తన బ్యాంక్ లాకర్‌ను తెరిచి చూడగా, అందులో దాచిన విలువైన వస్తువులన్నీ మాయమై ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉమ్మడిగా ఈ లాకర్‌ను నిర్వహిస్తున్న ఆయన, 2024వ సంవత్సరం తర్వాత దానిని ఉపయోగించలేదు. ఈ క్రమంలో, గురువారం ఉదయం తన కుమార్తె సురభితో కలిసి బ్యాంకుకు వెళ్లి లాకర్ తెరవడానికి ప్రయత్నించగా, దాని తాళం జామ్ కావడంతో బ్యాంక్ అధికారుల సహాయం కోరారు.
బ్యాంక్ అధికారుల సమక్షంలో ఎట్టకేలకు ఆ లాకర్‌ను తెరిచి చూడగా, లోపల భద్రపరిచిన వస్తువులన్నీ గల్లంతై లాకర్ పూర్తిగా ఖాళీగా ఉండటంతో ఆ రిటైర్డ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ హరీష్ మెహ్రా, లాకర్ ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని ధ్రువీకరిస్తూనే.. ఖాతాదారుడు తన వస్తువులను వేరే ఏదైనా బ్యాంక్ లాకర్లో పెట్టి మర్చిపోయి ఉండే అవకాశం కూడా ఉందని వింత సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై కమలా నగర్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభించారు. పోయిన తన విలువైన వస్తువులను వెంటనే రికవరీ చేసి అప్పగించాలని ఆ మాజీ అధికారి డిమాండ్ చేస్తుండగా, ఈ ఘటనతో బ్యాంకులోని మిగతా లాకర్ ఖాతాదారుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Leave a Reply